రాహుల్.. బ్యాక్ బెంచ్ అబ్బాయి!!
స్కూళ్లలో బాగా చదివే వాళ్లను ముందు బెంచీలలోను, అంతగా చదవని మొద్దబ్బాయిలను బ్యాక్ బెంచీలలోను కూర్చోబెడుతుంటారు. మరి ఈ పోలికను తనకు తాను అన్వయించుకున్నారో ఏమో గానీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా బుధవారం నాడు లోక్సభ సమావేశాల తొలి రోజున వెనకాల బెంచీలోనే కూర్చున్నారు.
లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా కూడా మల్లికార్జున ఖర్గేను ఎంచుకుని ఆ పదవికి సోనియా - రాహుల్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం నాడు లోక్సభలోని తొమ్మిదో బెంచీలో అస్రారుల్ హక్, శశిథరూర్ల పక్కకు వెళ్లి రాహుల్ గాంధీ కూర్చున్నారు. ముందు బెంచీలలోని విపక్ష విభాగంలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, వీరప్ప మొయిలీ, కేహెచ్ మునియప్ప తదితరులు కూర్చున్నారు.
కొసమెరుపు: రాహుల్ గాంధీకి వరుసకు తమ్ముడు, బీజేపీ ఎంపీ అయిన వరుణ్ గాంధీ కూడా అధికార పక్షం విభాగంలో వెనక బెంచీలోనే కూర్చున్నారు!!