న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తదితర సీనియర్ నేతలు హాజరవుతారు.
నామినేషన్ల దాఖలుకు ఈనెల 4వ తేదీ ఆఖరు కాగా ఇప్పటి వరకు ఎవరూ నామినేషన్ వేయలేదని పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ ముళ్లపల్లి రామచంద్రన్ తెలిపారు. రాహుల్ నాలుగుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారని, సీనియర్ నేతలైన సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్‌తోపాటు పార్టీ ముఖ్యమంత్రులు బలపరుస్తారని రామచంద్రన్ తెలిపారు.
దాదాపు 90 నామినేషన్ పత్రాలను ఆయా రాష్ట్రాల పార్టీ కార్యాలయాలకు పంపించామని, ఇప్పటి వరకు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదని వివరించారు. ఆఖరి రోజైన సోమవారం ఆయా రాష్ట్రాల ప్రతినిధులంతా అక్బర్ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారని, రాహుల్‌ను బలపరుస్తూ 75 వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారని తెలిపారు. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ఎన్నికపై వస్తున్న విమర్శలకు పార్టీ అధికార ప్రతినిధి సుస్మితా దేవ్ స్పందించారు. ఈ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుందని చెప్పారు.
మహిళలకు భద్రత కరువు: రాహుల్
గుజరాత్‌లో మహిళలకు భద్రత కరువైందని రాహుల్‌గాంధీ ట్వీటర్‌లో ఆరోపించారు. ‘రోజుకో ప్రశ్న’లో భాగంగా గుజరాత్‌లో మహిళలపై నేరాలు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. మహిళలకు భద్రత కల్పిస్తామని ప్రధాని ఇచ్చిన హామీలు బుట్టదాఖలయ్యాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment