
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలు.. సత్యం, అసత్యానికి మధ్య జరిగే యుద్ధమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. గుజరాత్ రాష్ట్రాన్ని పాలించే ప్రస్తుత బీజేపీకి నిజం చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. గుజరాతీయులు ఎప్పుడూ సత్యాన్నే నమ్ముతారు. సత్యానికే విలువ ఇస్తారని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలు సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.
ప్రస్తుతం గుజరాత్‌లో రైతులు దీనావస్థలో ఉన్నారు.. అలాగే విద్య, వైద్యం ఖరీదైనవిగా మారాయి.. ఇది సత్యం. వీటిపై బీజేపీ ప్రభుత్వం అన్ని సందర్భాల్లోనూ అసత్యాలు ప్రచారం చేస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే.. యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. అది సాధ్యం కాలేదు.. ప్రతినిత్యం చైనాతో పోటీకి ఆయన వెళతారు. చైనాలో ప్రతి 24 గంటల వ్యవధిలో 50 వేల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తోంది.. కానీ మోదీ హయాంలో కేవలం 450 మందికి మాత్రమే ఇవి కల్పించబడుతున్నాయని రాహుల్‌గాంధీ తెలిపారు. గుజరాత్‌లో నిరుద్యోగ సమస్య ఉంది.. ఇదిసత్యం.. దీనిని ప్రభుత్వం అసత్యంగా ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి మోదీ చేతిలో సైన్యం, పోలీసులు, ఉత్తర్ ప్రదేశ్, గోవా, చత్తీస్‌గఢ్‌లు ఉన్నాయి.. నా దగ్గర సత్యం మాత్రమే ఉందని రాహుల్ గాంధీ అన్నారు.