అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ. 15 లక్షల హామీ ఏమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తెచ్చి ఒక్కో భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానని మోదీ నాటి ఎన్నికల ప్రచారంలో హామీనివ్వడం తెలిసిందే. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ అనంతరం గాంధీనగర్ జిల్లాలోని అడాలజ్ అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది.
అక్కడ రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీకి అర్థం గబ్బర్ సింగ్ ట్యాక్సేనని మరోసారి విరుచుకుపడ్డారు. ఆ జీఎస్టీ అమల్లోకి వచ్చి దాదాపు 20 నెలలవుతున్నా ఆ వ్యవస్థ ఏంటో ఇప్పటికీ వ్యాపారులకు కూడా అర్థం కావడం లేదన్నారు. ఇటీవల పుల్వామాలో ఉగ్రవాద దాడి, అనంతరం బాలాకోట్‌లో వైమానిక దాడి, ఆ మరుసటి రోజే పాక్ ప్రతిఘటన తదితర ఘటనలపై రాహుల్ మాట్లాడుతూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజార్‌ను ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌లో దిగబెట్టి వచ్చింది జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవలేననీ, ఆ విమానాన్ని పంపింది మోదీయేనని ఆరోపించారు.
అంతకన్నా గొప్ప త్యాగం లేదు..
నియంతృత్వం, ద్వేషం, కోపం, విభజనవాదాలతో నిండిన ఆరెస్సెస్, బీజేపీల భావజాలాన్ని ఓడించడం కన్నా ఏ త్యాగమూ గొప్పది కాదని రాహుల్ సీడబ్ల్యూసీ భేటీలో అన్నారు. అడాలజ్ సభ కన్నా ముందు అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ జాతీయ స్మారకంలో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సీడబ్ల్యూసీ భేటీ రాహుల్ అధ్యక్షతన జరిగింది. ద్వేషాన్ని వ్యాప్తి చేసే శక్తులపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ తీర్మానించుకుందని రాహుల్ ఈ సందర్భంగా చెప్పారు. మహాత్మా గాంధీ గుజరాత్‌లోని దండిలో ఉప్పుసత్యాగ్రహాన్ని 1930 మార్చి 12న ప్రారంభించారు. రాహుల్ ఓ ట్వీట్ చేస్తూ ‘89 ఏళ్ల క్రితం గాంధీ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించింది ఈ రోజునే. బీజేపీ–ఆరెస్సెస్ భావజాలాన్ని ఓడించాలని ఈ రోజున మేం తీర్మానించుకున్నాం. ఈ ప్రయత్నంలో ఏ త్యాగమూ గొప్పకాదు. ఏ ప్రయత్నమూ చిన్నది కాదు. ఈ యుద్ధాన్ని గెలుస్తాం’ అని పేర్కొన్నారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేశ భద్రత దోపిడీ
సీడబ్ల్యూసీ భేటీ అవ్వడానికి ముందు సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి, ఆ తర్వాత సర్దార్ పటేల్ స్మారకంలో సమావేశం ప్రారంభానికి ముందు పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు కాంగ్రెస్ పార్టీ నివాళి అర్పించింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ,ఆజాద్ తదితరులంతా సీడబ్ల్యూసీ భేటీకి హాజరయ్యారు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్టీ ఓ తీర్మానాన్ని విడుదల చేసింది. ‘మనల్ని అందరినీ కలిపి ఉంచేది దేశ భద్రతే. కానీ మోదీ తన భారీ వైఫల్యాలను, తరచూ చెప్పే అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు దారుణంగా దేశ భద్రతను ఉపయోగించుకుంటున్నారు. ఇది తీవ్ర విచారకరం’ అని తీర్మానంలో పేర్కొంది. శత్రువులపై పోరులో దేశం మొత్తం ఒకటవుతుందనీ, హింస, ఉగ్రవాదంతో భారత్‌ను ఓడించడం జరగని పని అని కాంగ్రెస్ శత్రుదేశాలకు సందేశమిచ్చింది.
కాంగ్రెస్‌లోకి హార్దిక్ పటేల్
గుజరాత్‌లో పటేళ్ల రిజర్వేషన్ల కోసం భారీ ఉద్యమాన్ని నడిపిన హార్దిక్ పటేల్ లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలన్న తన నిర్ణయాన్ని హార్దిక్ సమర్థించుకుంటూ ఇప్పుడు తాను ఆరు కోట్ల గుజరాతీల కోసం పనిచేస్తానన్నారు. పార్టీలో చేరిన అనంతరం అడాలజ్ సభలో ‘నా నిర్ణయం సరైనదేనా?’ అని అడగ్గా, అక్కడి ప్రజలు అవునంటూ సమాధానమిచ్చారు. పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగితే మరోవైపు మోదీ ఎన్నికల ప్రచారం చేసుకున్నారని 25 ఏళ్ల హార్దిక్ విమర్శించారు.
బాధ్యుడే బాధితుడట
ప్రధాని మోదీ తప్పుడు విధానాల కారణంగా ఎంతో మంది ప్రజలు ఎన్నో కోల్పోయి, నష్టపోయి బాధితులుగా మారారనీ, దీనికి బాధ్యుడైన మోదీనే ఇప్పుడు తానే బాధితుడినని చెప్పుకుంటున్నారని సోనియా సీడబ్ల్యూసీ భేటీలో అన్నారు. యూపీఏ ప్రభుత్వం విజయాలను ప్రచారంలో ప్రధానాస్త్రాలుగా వాడాలన్నారు. జాతి ప్రయోజనాలకు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను మోదీ రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మన్మోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమన్నారు.
మోదీజీ ఉద్యోగాలేవి?: ప్రియాంక
క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ప్రియాంక గాంధీ తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తన తొలి ప్రసంగంలో ఆమె మోదీ లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై మోదీని అడాలజ్ సభలో ప్రియాంక ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ పాలనలో దేశం మొత్తం ద్వేషం వ్యాపిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది చూస్తోంటే తనకు బాధగా ఉందనీ, మాట ఇచ్చినట్లుగా మోదీ ఉద్యోగాలను ఎందుకివ్వలేదని ఆమె ప్రశ్నించారు.
ప్రజలు జాగరూకతతో ఉండాలనీ, ఓటును ఆయుధంగా వాడుకోవాలని, ఈ సమస్యలపై ప్రశ్నించడంతోపాటు తెలివైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రియాంక సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని, ఎక్కడ చూసినా ద్వేషాన్నే వ్యాపింపజేస్తోందని ఆరోపించారు. బీజేపీ లేవనెత్తే నిరర్థకమైన, ప్రగతి రహిత విషయాలకు తీవ్రంగా స్పందించి వారికి ఎరగా మారకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, అసలైన సమస్యలపై ప్రశ్నించాలని ఆమె కోరారు. అదే అసలైన దేశభక్తి అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment