పరామర్శకు వచ్చాను.. రాజకీయం చేయను!
కోల్‌కతా: ఫ్లైఓవర్ కూలిన ఘటన ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం సందర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో బాధితులకు అండగా నిలబడేందుకు తాను వచ్చానని, అంతేకానీ రాజకీయాలు చేయడానికి కాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కోల్‌కతా లో ఫ్లై ఓవర్‌లో కూలిపోయిన ఘటనలో అనేకమంది సామాన్యుల బతుకులు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అసన్సోల్‌లోని కుల్తీ ప్రాంతంలో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలి చాలామంది చనిపోయారని, దీనిపై రాజకీయాలు చేయకూడదని సీఎం మమతాబెనర్జీ చెప్పారని, అందుకే తాను రాజకీయ ప్రకటనలు చేయడం లేదని పేర్కొన్నారు. బెంగాల్ జరిగిన శారద చిట్‌ఫండ్ కుంభకోణంలో దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి అని, అయినా దీనిపై మమత ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కాంగ్రెస్-వామపక్షాల పొత్తుతో మరోసారి మమత సర్కార్ రాబోదనే విషయంలో ప్రజలకు అర్థమైందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పించడంపైనే ప్రధానంగా దృష్టిపెడతామని తెలిపారు.