Kolkata flyover collapse
-
పరామర్శకు వచ్చాను.. రాజకీయం చేయను!
కోల్‌కతా: ఫ్లైఓవర్ కూలిన ఘటన ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం సందర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో బాధితులకు అండగా నిలబడేందుకు తాను వచ్చానని, అంతేకానీ రాజకీయాలు చేయడానికి కాదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కోల్‌కతా లో ఫ్లై ఓవర్లో కూలిపోయిన ఘటనలో అనేకమంది సామాన్యుల బతుకులు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అసన్సోల్లోని కుల్తీ ప్రాంతంలో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలి చాలామంది చనిపోయారని, దీనిపై రాజకీయాలు చేయకూడదని సీఎం మమతాబెనర్జీ చెప్పారని, అందుకే తాను రాజకీయ ప్రకటనలు చేయడం లేదని పేర్కొన్నారు. బెంగాల్ జరిగిన శారద చిట్‌ఫండ్ కుంభకోణంలో దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి అని, అయినా దీనిపై మమత ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కాంగ్రెస్-వామపక్షాల పొత్తుతో మరోసారి మమత సర్కార్ రాబోదనే విషయంలో ప్రజలకు అర్థమైందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పించడంపైనే ప్రధానంగా దృష్టిపెడతామని తెలిపారు. -
బాంబు పేలుడా? యాక్ట్ ఆఫ్ గాడా?
కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కూలి 24 మంది మృతిచెందిన ఘటనపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. సామాన్యుల బతుకులను ఛిద్రం చేసిన ఈ దారుణమైన ప్రమాదానికి కారణాలు ఏమిటన్న దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుండగా.. నిర్మాణ కంపెనీ మాత్రం ఇందుకు బాంబు పేలుడు కూడా కారణమై ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఫ్లైఓవర్ కూలడంలో తమ నిర్లక్ష్యమేమీ లేదని, ఇందుకు కారణం ఏమిటో విచారణలో వెలికితీయాలని కోరుతోంది. ఈ ప్రమాదానికి 'యాక్ట్ ఆఫ్ గాడ్' (ప్రకృతి వైఫరీత్యం) కూడా కారణం కావొచ్చునని ఆ కంపెనీకి చెందిన ఉద్యోగి ఒకరు చెప్పడం గమనార్హం. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చూస్తున్న ఐవీఆర్సీఎల్ గ్రూప్‌కు చెందిన ఆరుగురు అధికారులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆ కంపెనీకి చెందిన మరింతమంది అధికారులను ప్రశ్నించేందుకు కోల్‌కతా పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈ ప్రమాదానికిగాను నిర్మాణ కంపెనిపై హత్య కేసు నమోదైంది. గతంలో ఐపీసీ సెక్షన్ 304 (నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు హరించడం) కింద కేసు నమోదు చేయగా.. తాజాగా ఆ సెక్షన్ ను తొలగించి 302 (హత్య) కింద అభియోగాలు నమోదు చేశారు. ఐవీఆర్సీఎల్ లీగల్ అడ్వయిజర్ షీలా పెద్దింటి మాట్లాడుతూ 'ప్రమాద స్థలంలో అద్దాలు పగిలిపోయాయి. ఇది బాంబు పేలుడు అయి ఉండవచ్చు' అని అనుమానాలు వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని సీఎం మమతాబెనర్జీ స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్: కోల్ కతా ఫ్లైఓవర్ మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. గురువారం కోల్ కతాలోని బుర్రాబజార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలడంతో 24 మంది మరణించారు. 88 మంది గాయపడగా వారికి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. My condolences to the families of bereaved and wishing speedy recovery of those injured in #Kolkata flyover collapse. — YS Jagan Mohan Reddy (@ysjagan) 1 April 2016