బాంబు పేలుడా? యాక్ట్ ఆఫ్ గాడా?
కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కూలి 24 మంది మృతిచెందిన ఘటనపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. సామాన్యుల బతుకులను ఛిద్రం చేసిన ఈ దారుణమైన ప్రమాదానికి కారణాలు ఏమిటన్న దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుండగా.. నిర్మాణ కంపెనీ మాత్రం ఇందుకు బాంబు పేలుడు కూడా కారణమై ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఫ్లైఓవర్ కూలడంలో తమ నిర్లక్ష్యమేమీ లేదని, ఇందుకు కారణం ఏమిటో విచారణలో వెలికితీయాలని కోరుతోంది. ఈ ప్రమాదానికి 'యాక్ట్ ఆఫ్ గాడ్' (ప్రకృతి వైఫరీత్యం) కూడా కారణం కావొచ్చునని ఆ కంపెనీకి చెందిన ఉద్యోగి ఒకరు చెప్పడం గమనార్హం.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చూస్తున్న ఐవీఆర్సీఎల్ గ్రూప్‌కు చెందిన ఆరుగురు అధికారులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆ కంపెనీకి చెందిన మరింతమంది అధికారులను ప్రశ్నించేందుకు కోల్‌కతా పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈ ప్రమాదానికిగాను నిర్మాణ కంపెనిపై హత్య కేసు నమోదైంది. గతంలో ఐపీసీ సెక్షన్ 304 (నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు హరించడం) కింద కేసు నమోదు చేయగా.. తాజాగా ఆ సెక్షన్ ను తొలగించి 302 (హత్య) కింద అభియోగాలు నమోదు చేశారు. ఐవీఆర్సీఎల్ లీగల్ అడ్వయిజర్ షీలా పెద్దింటి మాట్లాడుతూ 'ప్రమాద స్థలంలో అద్దాలు పగిలిపోయాయి. ఇది బాంబు పేలుడు అయి ఉండవచ్చు' అని అనుమానాలు వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని సీఎం మమతాబెనర్జీ స్పష్టం చేశారు.