West Bengal polls
-
అక్కడ 'నోటా' దుమ్మురేపింది!
పై వారెవరూ కాదు (నన్ ఆఫ్ ది అబో- నోటా).. అని ఈవీఎంలపై ఉండే ఈ మీటనే తాజా ఎన్నికల్లో ఓటర్లను ఎక్కువగా ఆకర్షించినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కును ఓటర్లకు కల్పిస్తున్న నోటాకు పశ్చిమ బెంగాల్లో భారీగా ఓట్లు పోలయ్యాయి. బెంగాల్‌లోని చాలా నియోజకవర్గాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష వామపక్ష-కాంగ్రెస్ కూటమి, బీజేపీల తర్వాత అత్యధిక ఓట్లు నోటాకే పడ్డాయి. దీంతో 'నోటా'నే నాలుగో పోటీదారుగా చాలాచోట నిలిచింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన బీఎస్పీ, సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్‌యూసీఐ, స్వతంత్ర అభ్యర్థుల కంటే కొన్నిచోట్ల నోటాకే అధిక ఓట్లు రావడం గమనార్హం. ఇదే తరహా పరిస్థితి ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పుదుచ్చేరి, తమిళనాడు, అసోంలోనూ కనిపించింది. ఇక్కడ కూడా 'నోటా'కు ఓటర్లు గణనీయంగానే మొగ్గుచూపారు. ఒక్క కేరళలో మాత్రం 'నోటా'కు చాలా తక్కువమంది ఓటు వేశారు. అసోంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంటే 'నోటా'కే ఎక్కువ ఓట్లు పడటం గమనార్హం. బెంగాల్లో 6.6 కోట్ల ఓటర్లు ఉండగా, అందులో 8లక్షలకుపైగా మంది ఓటర్లు తమకు ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 'నోటా'కు ఓటు గుద్దారు. బెంగాల్లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఐదులక్షలకుపైగా 'నోటా'ను వినియోగించుకున్నారు. -
బెలూన్లు, క్యాండిళ్లు, బైనాక్యులర్లపై నిషేధం!
బహిరంగ స్థలాల్లో బెలూన్లు, క్యాండిళ్లు, ఫ్లూటుల లాంటివాటిని వినియోగించడంపై నిషేధం ఉందన్న విషయం మీకు తెలుసా? అవును.. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో వాటిని ఉపయోగిస్తే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుందట. ఏడు కిరణాలతో కూడిన పెన్ను పాళీ, బెలూన్, వజ్రం, బైనాక్యులర్లు, బ్యాట్, కొవ్వొత్తులు.. ఇలాంటివాటిని పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులుగా కేటాయించారు. దాంతో.. వీటన్నింటినీ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల రోజు, దానికి 48 గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం చేయకూడదని, అక్కడ 144వ సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని ఎన్నికల డిప్యూటీ ప్రధానాధికారి అంజన్ ఘోష్ చెప్పారు. అయితే.. ఎవరైనా అభ్యర్థికి ఫ్యాన్ గుర్తు కేటాయించినా.. పోలింగ్ కేంద్రం లోపల ఫ్యాన్లు వేయకూడదన్న రూల్ మాత్రం ఉండబోదని తెలిపారు. ఏజెంట్లు అభ్యర్థుల ఎన్నికల గుర్తులను ప్రదర్శించకూడదని, ఐడెంటిటీ కార్డుమీద కూడా కేవలం పేరు మాత్రమే ఉండాలని వివరించారు. -
బెంగాల్ రెండో దశలో 80 శాతం పోలింగ్
కోల్‌కతా: చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా పశ్చిమబెంగాల్ రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 80 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 383 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఉత్తర బెంగాల్‌లోని అలీపుర్దౌర్, జల్పాయ్గురి, డార్జిలింగ్, ఉత్తర దినాజ్‌పుర్, దక్షిణ దినాజ్‌పుర్, మాల్డాతో పాటు దక్షిణ బెంగాల్‌లోని బీర్బూమ్ జిల్లాలోని 56 నియోజకవర్గాల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. బీర్బూమ్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా మిగతా చోట్ల సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. తృణమూల్ కాంగ్రెస్ వివాదాస్పద నేత అనుబ్రత మండల్‌పై ఈసీ నిరంతర నిఘా పెట్టింది. చొక్కాపై తృణమూల్ పార్టీ గుర్తుతో ఓటు వేసేందుకు అనుబ్రత వెళ్లడం మరో వివాదానికి దారితీసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. మాల్డా జిల్లాలోని ఇంగ్లిష్‌బజార్ నియోజకవర్గంలో తృణమూల్, సీపీఎం కార్యకర్తల ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. పోలింగ్ అధికారి తృణమూల్‌కు అనుకూలంగా వ్యవరించడంతో అతన్ని తక్షణం విధులనుంచి తప్పించారు. బీర్బూమ్ జిల్లా డుమ్రుత్ గ్రామంలో ఉదయం బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలో ఎనిమిది మంది గాయపడ్డారు. -
బాంబు పేలుడా? యాక్ట్ ఆఫ్ గాడా?
కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కూలి 24 మంది మృతిచెందిన ఘటనపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. సామాన్యుల బతుకులను ఛిద్రం చేసిన ఈ దారుణమైన ప్రమాదానికి కారణాలు ఏమిటన్న దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుండగా.. నిర్మాణ కంపెనీ మాత్రం ఇందుకు బాంబు పేలుడు కూడా కారణమై ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఫ్లైఓవర్ కూలడంలో తమ నిర్లక్ష్యమేమీ లేదని, ఇందుకు కారణం ఏమిటో విచారణలో వెలికితీయాలని కోరుతోంది. ఈ ప్రమాదానికి 'యాక్ట్ ఆఫ్ గాడ్' (ప్రకృతి వైఫరీత్యం) కూడా కారణం కావొచ్చునని ఆ కంపెనీకి చెందిన ఉద్యోగి ఒకరు చెప్పడం గమనార్హం. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చూస్తున్న ఐవీఆర్సీఎల్ గ్రూప్‌కు చెందిన ఆరుగురు అధికారులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆ కంపెనీకి చెందిన మరింతమంది అధికారులను ప్రశ్నించేందుకు కోల్‌కతా పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈ ప్రమాదానికిగాను నిర్మాణ కంపెనిపై హత్య కేసు నమోదైంది. గతంలో ఐపీసీ సెక్షన్ 304 (నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు హరించడం) కింద కేసు నమోదు చేయగా.. తాజాగా ఆ సెక్షన్ ను తొలగించి 302 (హత్య) కింద అభియోగాలు నమోదు చేశారు. ఐవీఆర్సీఎల్ లీగల్ అడ్వయిజర్ షీలా పెద్దింటి మాట్లాడుతూ 'ప్రమాద స్థలంలో అద్దాలు పగిలిపోయాయి. ఇది బాంబు పేలుడు అయి ఉండవచ్చు' అని అనుమానాలు వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని సీఎం మమతాబెనర్జీ స్పష్టం చేశారు. -
'అక్కడ కుస్తీలు పడుతూ.. ఇక్కడ చేతులు కలిపారు'
ఖరగ్‌పూర్: కేరళలో అధికారం కోసం కుస్తీలు పడుతున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమబెంగాల్లో రాజకీయ లబ్ది కోసం చేతులు కలిపాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆదివారం పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఒకప్పుడు పరిశ్రమలకు రాజధానిగా ఉన్న బెంగాల్ కమ్యూనిస్టుల పాలనలో వెనుకబడగా, తృణమాల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి మరింత దిగజారిందని డిందని మోదీ విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడ్డాయని, బాంబులు తయారు చేసే పరిశ్రమ ఒక్కటే నడుస్తోందని ఆరోపించారు. ముద్ర పథకాన్ని ముందుగా ప్రవేశపెట్టినట్టయితే శారదా కుంభకోణం జరిగిఉండేది కాదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ కుంభకోణం గురించి అయినా విన్నారా మోదీ అన్నారు. -
మళ్లీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు
కన్హయ్య తాజా ప్రసంగంపై పోలీసులకు ఏబీవీపీ ఫిర్యాదు న్యూఢిల్లీ: రాజద్రోహం అభియోగాలపై అరెస్టయి బెయిల్‌పై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ బెయిల్ షరతులను ఉల్లంఘించి మళ్లీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. మన సైనికుల పట్ల మాకు చాలా గౌరవం ఉంది.. అయినా కశ్మీర్లో మహిళలపై మన భద్రతా సిబ్బంది అత్యాచారాలు చేశారన్న వాస్తవం గురించి మేం మాట్లాడతాం’ అని మంగళవారం జేఎన్‌యూలో జరిగిన సభలో కన్హయ్య అన్నారు. దీంతో కన్హయ్యతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదితామీనన్ పైనా బీజేవైఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కశ్మీర్‌ను భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని ఆమె అన్నారని ఆరోపించింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లను: కన్హయ్య పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను వామపక్ష పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కన్హయ్య కుమార్ తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఉద్దేశం తనకు లేదని ఇదివరకే స్పష్టంచేశానన్నారు. పీహెచ్డీ పూర్తిచేశాక అధ్యాపకవృత్తి చేపట్టాలన్నదే తన లక్ష్యమని వెల్లడించారు. -
విద్యార్థులతో తృణమూల్ కాంగ్రెస్ ప్రయోగం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో పార్టీకి అవసరయ్యే సమాచారం అందించేందుకు ఇద్దరు విద్యార్థులను తృణమూల్ కాంగ్రెస్ ఎంపికచేసింది. రాజకీయ అనుభవం లేని సుమేధ జలోట్, పియూష్ గుప్తాలు... తృణమూల్ ఎంపీలు డెరెక్ ఓబ్రియెన్, సుదీప్ బంద్యోపాధ్యాయ్‌లతో కలసి పనిచేస్తారు. జలోట్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేయగా, పీయూష్.. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. రాష్ట్రాభివృద్ధి, జాతీయ సూచీలకు అనుగుణంగా రాష్ట్రం పనితీరుపై వీరు పార్టీకి నివేదిక ఇస్తారు. ఇతర అభ్యర్థుల ప్రచారం ఎలా ఉందో తెలుసుకుని దాని ఆధారంగా ప్రజాభిప్రాయాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చే సూచనలిస్తామన్నారు. 116 మందితో లెఫ్ట్ కూటమి మొదటి జాబితా బెంగాల్ ఎన్నికల కోసం లెఫ్ట్ కూటమి సోమవారం 116 మందితో తొలి జాబితా విడుదల చేసింది. వీరిలో 60మంది తొలిసారి బరిలోకి దిగుతున్నారు. -
అక్కడ కొట్టుకుందాం.. ఇక్కడ కలిసివెళ్దాం!
న్యూఢిల్లీ: త్వరలో పశ్చిమ బెంగాల్, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు అంశం హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ బెంగాల్లో వామపక్షాలతో కలిసి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బెంగాల్లో సుత్తెకొడవలితో కలిసి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం పార్టీ అధిష్ఠానానికి నివేదించినట్టు తెలుస్తోంది. దీంతో వామపక్షాలతో వ్యూహాత్మక సర్దుబాటు చేసుకొని మమతా బెనర్జీని ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, బహిరంగంగా బెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు పొత్తు పెట్టుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే అదే సమయంలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం. అక్కడ ఈ రెండు పార్టీలు బద్ధ శత్రువులుగా ఒకరితో ఒకరు తలపడటం.. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని రాజకీయ సమీకరణలపై ఆ రాష్ట్ర పరిశీలకులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు త్వరలోనే అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయని, పొత్తు పెట్టుకోవడమే మంచిదనే అభిప్రాయంతో రెండు పార్టీల శ్రేణులు కూడా ఉన్నాయని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. కాంగ్రెస్, వామపక్షాల పొత్తుతో బెంగాల్లో రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుందని ఆయన అన్నారు.