మళ్లీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు
కన్హయ్య తాజా ప్రసంగంపై పోలీసులకు ఏబీవీపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: రాజద్రోహం అభియోగాలపై అరెస్టయి బెయిల్‌పై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ బెయిల్ షరతులను ఉల్లంఘించి మళ్లీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. మన సైనికుల పట్ల మాకు చాలా గౌరవం ఉంది.. అయినా కశ్మీర్‌లో మహిళలపై మన భద్రతా సిబ్బంది అత్యాచారాలు చేశారన్న వాస్తవం గురించి మేం మాట్లాడతాం’ అని మంగళవారం జేఎన్‌యూలో జరిగిన సభలో కన్హయ్య అన్నారు. దీంతో కన్హయ్యతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదితామీనన్ పైనా బీజేవైఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కశ్మీర్‌ను భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని ఆమె అన్నారని ఆరోపించింది.
ఎన్నికల ప్రచారానికి వెళ్లను: కన్హయ్య
పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను వామపక్ష పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కన్హయ్య కుమార్ తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఉద్దేశం తనకు లేదని ఇదివరకే స్పష్టంచేశానన్నారు. పీహెచ్‌డీ పూర్తిచేశాక అధ్యాపకవృత్తి చేపట్టాలన్నదే తన లక్ష్యమని వెల్లడించారు.