Kerala polls
-
క్రికెటర్ శ్రీశాంత్‌కు బీజేపీ టికెట్!
కోచి: టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. త్వరలో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశాంత్‌ను బరిలో దింపాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీ నాయకులు ఈ విషయంపై శ్రీశాంత్‌ను సంప్రదించారు. కాగా ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని శ్రీశాంత్ చెప్పాడు. మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరించాడు. మే 16న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో త్రిపునితుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేయాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ అగ్రనేత ఢిల్లీ నుంచి శ్రీశాంత్‌కు ఫోన్ చేశాడని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేరళ పర్యటనకు వచ్చినపుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో శ్రీశాంత్ సమావేశం కావచ్చని తెలిపారు. కాగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజశేఖరన్ చెప్పారు. శ్రీశాంత్ సెలెబ్రిటీ కావడంతో బీజేపీ అధిష్టానం నేరుగా అతనితో సంప్రదించి ఉంటుందని మరో నేత అన్నారు. 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్ ఆ తర్వాత క్రికెట్‌కు దూరమయ్యాడు. గతేడాది ఢిల్లీ కోర్టు శ్రీశాంత్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అతను ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు. -
మళ్లీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు
కన్హయ్య తాజా ప్రసంగంపై పోలీసులకు ఏబీవీపీ ఫిర్యాదు న్యూఢిల్లీ: రాజద్రోహం అభియోగాలపై అరెస్టయి బెయిల్‌పై విడుదలైన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్ బెయిల్ షరతులను ఉల్లంఘించి మళ్లీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. మన సైనికుల పట్ల మాకు చాలా గౌరవం ఉంది.. అయినా కశ్మీర్లో మహిళలపై మన భద్రతా సిబ్బంది అత్యాచారాలు చేశారన్న వాస్తవం గురించి మేం మాట్లాడతాం’ అని మంగళవారం జేఎన్‌యూలో జరిగిన సభలో కన్హయ్య అన్నారు. దీంతో కన్హయ్యతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదితామీనన్ పైనా బీజేవైఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కశ్మీర్‌ను భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని ఆమె అన్నారని ఆరోపించింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లను: కన్హయ్య పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను వామపక్ష పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కన్హయ్య కుమార్ తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఉద్దేశం తనకు లేదని ఇదివరకే స్పష్టంచేశానన్నారు. పీహెచ్డీ పూర్తిచేశాక అధ్యాపకవృత్తి చేపట్టాలన్నదే తన లక్ష్యమని వెల్లడించారు.