క్రికెటర్ శ్రీశాంత్కు బీజేపీ టికెట్!
కోచి: టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. త్వరలో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశాంత్ను బరిలో దింపాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీ నాయకులు ఈ విషయంపై శ్రీశాంత్ను సంప్రదించారు. కాగా ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని శ్రీశాంత్ చెప్పాడు. మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరించాడు. మే 16న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల్లో త్రిపునితుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేయాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ అగ్రనేత ఢిల్లీ నుంచి శ్రీశాంత్కు ఫోన్ చేశాడని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేరళ పర్యటనకు వచ్చినపుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో శ్రీశాంత్ సమావేశం కావచ్చని తెలిపారు. కాగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజశేఖరన్ చెప్పారు. శ్రీశాంత్ సెలెబ్రిటీ కావడంతో బీజేపీ అధిష్టానం నేరుగా అతనితో సంప్రదించి ఉంటుందని మరో నేత అన్నారు.
2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్ ఆ తర్వాత క్రికెట్కు దూరమయ్యాడు. గతేడాది ఢిల్లీ కోర్టు శ్రీశాంత్ను నిర్దోషిగా ప్రకటించింది. అతను ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నాడు.