
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం సమయంలో ఫోన్ చూసుకుంటూ గడిపి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద ట్వీట్‌తో ఇరకాటంలో పడ్డారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాహుల్ చేసిన ట్వీట్‌పై పలువురు మండిపడుతున్నారు. ఆర్మీ డాగ్ యూనిట్ వెల్లడించిన రెండు ఫోటోలను శుక్రవారం ట్విటర్‌లో షేర్ చేసిన రాహుల్ దానికి ఇచ్చిన క్యాప్షన్‌తో విమర్శలకు తావిచ్చారు. ‘సైనిక సిబ్బందితో కలిసి కుక్కలు యోగాసనాలు వేస్తున్నాయి..ఇదే న్యూ ఇండియా’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ వివాదాస్పదమైంది.
రాహుల్ యోగా డేపై చేసిన వ్యాఖ్యలతో దేశాన్ని, సైనిక పాటవాన్ని అవమానించారని నెటిజన్లు మండిపడ్డారు. రాహుల్ యోగా దినోత్సవాన్ని, ఆర్మీ డాగ్ యూనిట్‌ను కించపరిచారని విమర్శించారు. భారత సంస్కృతిని, సైన్యాన్ని అపహాస్యం చేసేలా రాహుల్ వ్యాఖ్యానించారు. ‘ఇవి కేవలం కుక్కలే కాదు సార్..మన భారత్ కోసం ఇవి పోరాడుతున్నాయి..వాటికి సెల్యూట్ చేయండి’ అని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర ట్వీట్ చేశారు. రాహుల్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని, మన సైన్యం, వీర జవాన్లు, డాగ్ యూనిట్, యోగ సంప్రదాయాలను ఆయన అవమానించారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ట్వీట్ చేశారు. రాహుల్ వంటి నేతతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా నెట్టుకొస్తారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment