చోటిలా(గుజరాత్): కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనలో చివరి రోజైన బుధవారం సురేంద్ర నగర్ జిల్లాలోని ప్రఖ్యాత చోటిలా ఆలయాన్ని సందర్శించారు. 15 నిమిషాల్లో దాదాపు వెయ్యి మెట్లు ఎక్కి చాముండా మాతను దర్శనం చేసుకున్నారు. పటేల్ వర్గీయుల ఆరాధ్య దైవం ఖోదల్‌ధామ్ గుడితోపాటు మరో రెండు ఆలయాలనూ ఆయన సందర్శించారు.
బీజేపీ ఆరెస్సెస్‌లు కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, అది వారి దుష్ప్రచారమేనని నిరూపించేందుకే రాహుల్ ఆలయాలను సందర్శిస్తున్నారని ఓ కాంగ్రెస్ నేత చెప్పారు. బుధవారం రాహుల్ ఓ చోట మాట్లాడుతూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీ కలసి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. ఇది తాను చెబుతున్న మాట కాదనీ, మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తన వ్యాసంలో రాశారని రాహుల్ పేర్కొన్నారు. పేదల దీనావస్థను విస్మరించిన ప్రభుత్వం, కొంతమంది ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తోందని దుయ్యబట్టారు.