సాక్షి,గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సౌరాష్ట్రలో సాగిన మూడు రోజుల పర్యటనల్లో హిందువులను ఆకట్టుకునేందుకు దేవాలయాలను సందర్శించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మలివిడత టూర్‌లోనూ ‘టెంపుల్ రన్’ కొనసాగించనున్నారు. ఈనెల 9నుంచి 11 వరకూ మూడు రోజుల పాటు సాగే రెండో విడత పర్యటనలో భాగంగా రాహుల్ నడియాద్‌లోని శాంత్‌రామ్ దేవాలయాన్ని, ఫగ్వెల్‌లో కొలువైన భత్జీ మహరాజ్ ఆలయాన్ని, పావ్‌గఢ్‌లో మాకాశీ టెంపుల్‌ను, ఖేదా జిల్లాలో దకోర్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టూర్‌లో భాగంగా వదోదర, బొదేలీలో రెండు రోడ్‌షోలు నిర్వహించనున్నారు. 18 చిన్నపాటి సభలు, నాలుగు సంవాద్ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు రైతులు, వ్యాపారులు, కార్మిక సంఘాల నేతలతో సమావేశమవుతారు.
పార్టీపై మైనారిటీలకు అనుకూలమన్న ముద్రను తొలగించుకునేందుకు, హిందువులను ఆకట్టుకునేందుకే ఆయన ఆలయాల బాట పట్టారని భావిస్తున్నారు. మైనారిటీలను దూరం చేసుకోకుండానే హిందువుల ఓట్లకు గాలం వేస్తూ ఓటు బ్యాంక్‌ను విస్తృతం చేసుకోవాలన్నది రాహుల్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక దీపావళి తర్వాత రాహుల్ ఉత్తర గుజరాత్ యాత్రను చేపట్టి అంబాజీ, బెచరజి, ఉంజా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు.
సౌరాష్ట్రలో రోడ్‌షోలను ముగించుకున్న రాహుల్ మలివిడత పర్యటనలు ఎనిమది జిల్లాల్లోని 500 కిమీ మీదుగా మధ్య గుజరాత్‌లో సాగుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment