![Rahul to remove Italian glasses : Amit Shah - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/2/amithshaaaaaaah.jpg.webp?itok=XflZjXzG)
సాక్షి,అహ్మదాబాద్: బీజేపీ హయాంలో గుజరాత్‌లో చోటుచేసుకున్న అభివృద్ధిని చూడాలంటే రాహుల్ గాంధీ ఇటలీ కళ్లద్దాలను తీసేయాలని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా అన్నారు. గుజరాత్ గౌరవ్ యాత్రలో భాగంగా సోమవారం పోర్‌బందర్‌లో జరిగిన ర్యాలీలో అమిత్ షా తనదైన శైలిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. రాహుల్ ఇటీవలి అమెరికా పర్యటనను విహార యాత్రగా ఆయన అభివర్ణించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో గుజరాత్‌కు ఏమిచ్చిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని, గుజరాత్‌కు తాము ఎయిమ్స్‌ను కేటాయించామని, రాజ్‌కోట్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, నర్మదా డ్యామ్ ఎత్తు పెంపుకు అనుమతించామని గుర్తుచేశారు.
ఆరు లక్షల మంది పట్టణ పేదలకు ఇళ్లు కేటాయించామని చెప్పారు. ఇటలీ కళ్లద్దాలు ధరించడంతో ఈ అభివృద్ధిని రాహుల్ చూడలేరని అమిత్ షా ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో మూడు తరాల వారికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని గుజరాత్ ప్రజలు విశ్వసించరని అన్నారు.