రాజధాని ఎక్స్ప్రెస్కు తప్పిన భారీ ముప్పు
బీహార్లోని గయ ప్రాంతంలో రాజధాని ఎక్స్ప్రెస్ రైలుకు భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆ రైలు వెళ్లాల్సిన ప్రాంతంలో రైలు పట్టాలను మావోయిస్టులు ధ్వంసం చేశారు. అయితే, ముందుగా వెళ్లిన పైలట్ ఇంజన్ ఈ విషయాన్ని గుర్తించడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. లేనిపక్షంలో రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి ఉండేది. మంగళవారం రాత్రి మావోయిస్టులు ఇక్కడి రైలుపట్టాలను పేల్చేసినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇస్లాంపూర్- రఫీగంజ్ ప్రాంతాల మధ్య రైలు పట్టాలు ధ్వంసమై ఉన్నట్లు పైలట్ ఇంజన్ డ్రైవర్ అధికారులకు తెలిపాడు. ఈ పైలట్ ఇంజన్, న్యూఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ-భువనేశ్వర్ రైళ్లకు ముందుగా వెళ్తోంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శతాబ్డి, రాజధాని లాంటి రైళ్లు వెళ్లేముందు పైలట్ ఇంజన్ ఒకటి నడిపించాలని రైల్వే అధికారులు చేసని హెచ్చరిక పాటించడం వల్లే భారీ ప్రమాదం తప్పింది. ఔరంగాబాద్ జిల్లాలో పోలీసు కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. పైలట్ రైలు ఇంజన్ పట్టాలు తప్పిందని రైల్వేబోర్డు ఛైర్మన్ అరుణేంద్రకుమార్ తెలిపారు. నాలుగు మీటర్ల పొడవున రైలు పట్టాలు ధ్వంసమైందని ఆయన అన్నారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ సంఘటనపై నివేదిక పంపాల్సిందిగా రైల్వే మంత్రి సదానందగౌడ ఆదేశించారు.