ఛత్తీస్‌ఘడ్, రాయ్‌పూర్: ప్రపంచ దేశాలన్నింటిని భయబ్రాంతులకు గురిచేస్తూ తన ముందు మోకరిల్లేలా చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమై కరోనా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది తమకేమౌతుందో అని భయపడుతుంటే.... మరికొందరు లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి విలవిలలాడుతున్నారు. అయితే ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్ జంటను మాత్రం ఈ పేరు భయపెట్టినట్టు కనిపించడం లేదు. ఈ పేర్లను వినడానికే భయపడుతుంటే వారు ఏకంగా వారికి పుట్టిన కవలలకే కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టుకున్నారు.
ఈ విషయం కవలల తల్లి ప్రీతివర్మ మాట్లాడుతూ మార్చి 27వ తేదీ మాకు కవలలు( ఒక బాబు, ఒకపాప) జన్మించారు. మేం పాపకి కరోనా అని, బాబుకి కోవిడ్ అని పేరు పెట్టాం. నా ప్రసవం చాలా కష్టాల మధ్య జరిగింది. అవన్నీ గుర్తిండేలా ఈ పేర్లను పెడదామని నేను, నా భర్త అనుకున్నాం. ఈ వైరస్ చాలా ప్రమాదకారి అయిన అది మనందరికి పరిశుభ్రతను పాటించడం, ఆరోగ్యకరంగా ఉండటం, మంచి అలవాట్లను ఎన్నింటినో నేర్పిస్తోంది. అందుకే మా పిల్లలకు ఆ పేర్లు పెట్టాలనుకున్నాం. హాస్పటల్ సిబ్బంది కూడా మా పిల్లల్ని ఆ పేర్లతో పిలుస్తుండటంతో మేం కూడా ఆ పేర్లనే పెట్టాలని నిర్ణయించుకున్నాం.
మార్చి 26, అర్ధరాత్రి నాకు నొప్పులు మొదలయ్యాయి. ఆ టైంలో అంబులెన్స్ సాయంతో మేం ఆసుపత్రికి బయలుదేరాం. కానీ లాక్‌డౌన్ కారణంగా పోలీసులు మా వాహనాన్ని చాలా చోట్ల ఆపారు. కానీ మా పరిస్ధితిని అర్ధం చేసుకొని మమ్మల్ని పంపించారు. కరోనా కారణంగా హాస్పటల్‌లో సిబ్బంది ఉంటారో లేదో అనుకున్నాను. కానీ ఆసుపత్రి సిబ్బంది చాలా సాయం చేశారు. మా బంధువులు నాకు సాయంగా ఆసుపతత్రికి రావాలనుకున్నారు. కానీ లాక్‌డౌన్ కారణంగా రాలేకపోయారు అని ఆమె తెలిపారు. అయితే ఇది వరకే కొంతమంది శిశువులకు లాక్‌డౌన్, కరోనా అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: పాప పేరు కరోనా.. బాబు పేరు లాక్‌డౌన్
ఈ విషయం పై శిశువులు జన్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమొరిల్ హాస్పిటల్ పీఆర్‌ఓ సుబ్రా సింగ్ మాట్లాడుతూ తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఆమె హాస్పటల్‌కి వచ్చిన వెంటనే పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో ఆపరేషన్‌కి అన్ని ఏర్పాట్లు చేశామని సింగ్ తెలిపారు. వచ్చిన 45 నిమిషాల్లో ఆపరేషన్ చేశామని చెప్పారు. కరోనా, కొవిడ్ అని పేర్లు పెట్టడంతో ఆ శిశివులు ఆసుపత్రిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment