ఎ.రాజా, కనిమొళిపై ఛార్జిషీట్ నమోదు
న్యూఢిల్లీ : 2జీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళిపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈడీ దర్యాప్తు నివేదిక ఆధారంగా శుక్రవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఐపీసీ 120-బి కింద నిందితులపై కేసు నమోదు చేసింది. నేరం రుజువైతే వీరికి ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఎం.రాజా, కనిమొళితో పాటు డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మళ్ సహా 16మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రాజా, కనిమొళి ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. అలాగే స్వాన్ టెలికాం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్, వినోద్ గోయోంకాలపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. మరోవైపు నిందితులు మాత్రం తాము ఎలాంటి నేరం చేయలేదని చెబుతున్నారు. తమపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు.
కాగా ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి మారన్, ఆయన సోదరుడికి రెండు రోజుల క్రితం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.. దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వారిద్దరితో పాటు మలేషియా వ్యాపారవేత్త టి. ఆనంద్ కృష్ణన్కు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి.