
జైపూర్ : రెండో వివాహం ద్వారా మూడో బిడ్డను పొందినవారు కూడా పదోన్నతులకు అర్హులేనని రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. పదోన్నతుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ జైరాం మీనా అనే వ్యక్తితో పాటు మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎమ్‌ఎన్ భండారి, జస్టిస్ డీసీ సోమనాయ్ డివిజన్ బెంచ్ వీరికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.
జనాభా నియంత్రణలో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం 2002, జూన్‌లో ఒక నిబంధనను అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులకు అనర్హులని తెలిపింది. అయితే 2015 నవంబర్ 30న ఈ నిబంధనను సడలించింది. మొదటి భార్య/ భర్త ద్వారా ఇద్దరు సంతానాన్ని పొంది, రెండవ వివాహం ద్వారా మరో సంతానాన్ని పొందిన వారు ఈ నిబంధన పరిధిలోకి రారని ప్రకటించింది. అయితే సడలించిన ఈ నిబంధనను తమకు వర్తింపచేసి పదోన్నతి ఇవ్వాల్సిందిగా జైరాం తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ఈ పిటిషన్‌ను విచారించి వీరు కూడా పదోన్నతులకు అర్హులేనని తీర్పునిచ్చింది