‘రజనీ’ అవసరమా..?
దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర కమలనాథులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. మరో వైపు ఆయన అవసరమా..? అంటూ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి పెదవి విప్పారు. ఈ వ్యాఖ్యలు కమలంలో మంటలు పుట్టిస్తున్నాయి.
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. నాటి నుంచి కమలనాథులు కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతాన్ని ప్రజ ల్లోకి పంపించే పనిలో పడ్డారు. డీఎంకే అవినీతి ఊబిలో కూరుకుపోయిన పార్టీ అని ప్రచారం తీవ్రం చేశారు. ఈ సమయంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సైతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కటకటాల్లోకి వెళ్లడం కమలనాథుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
‘స్టార్’ జపం : తాజా రాజకీయ పరిణామాల్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా రాష్ర్టంలో అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదగాలంటే బలమైన నాయకత్వం, మద్దతు అవసరమన్న విషయాన్ని కమలనాథులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ నినాదాన్ని అందుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఁరజనీరూ. జపం అందుకున్నారు. ఁస్టార్‌రూ. పేరు తలచుకోందే ఆమె ప్రెస్‌మీట్‌లు సాగడం లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సైతం రజనీతో మాట్లాడినట్టు, సీఎం అభ్యర్థి ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జోరుగానే సాగుతోంది.
తమ కథానాయుడిని రాజకీయల్లో దించాలని ఏళ్ల తరబడి ప్రయత్నాల్లో ఉన్న అభిమానులకు కమలనాథులు చర్యలు ఆనందంలో ముంచుతున్నాయి. డిసెంబర్ 12న తన బర్తడే సందర్భంగా అభిమానుల్ని రజనీకాంత్ కలవబోతున్న సంకేతాలతో ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారోనన్న ఎదురు చూపులు పెరిగారుు. ఈ క్రమంలో సంచలనాలు, వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపొందిన బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించినట్టుగా ఓ తమిళమీడియా వార్తను ప్రచురించింది. అందులో సుబ్రమణ్య స్వామి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే పూర్తిగా బలహీన పడ్డాయని, కాంగ్రెస్ చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ర్టంలో బలోపేతం, 2016లో అధికారం లక్ష్యంగా బీజేపీ నేతలు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. తమిళనాడు రాజకీయాల్లో సినీ సంప్రదాయం గతంలో ఒక వెలుగు వెలిగిందని వివరిస్తూ, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని పేర్కొన్నారు.
రాణించ గలడా...? : సినీ సంప్రదాయానికి స్వస్తి పలికి, పట్టభద్రుడు, తమకు అండగా నిలబడే శక్తి అధికారంలోకి రావాలని ప్రజలు కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. యాధాప్రకారం సినీ రాజకీయాల కోసం ప్రాకులాడడం సబబుకాదని తెలిపారు. రజనీకాంత్ చాలా మంచి వాడని, తమ ఇద్దరి మధ్య మర్యాద పూర్వక వాతావరణం ఉందన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినా నెట్టుకు రాగలడా..?, ఇక్కడి రాజకీయ ఁసినీరూ. సంప్రదాయంలో రాణించడం ఆయన వల్ల అవుతుందా..? అన్నది తెలియదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రజనీ మద్దతు అవసరం ఉందా...? ఆయన్ను రాజకీయూల్లోకి తీసుకురావాల్సినంతగా అవసరం ఉందా..? అని ఎదురు ప్రశ్న వేయడం గమనార్హం.సినిమా వాళ్ల వద్దకు కాదు...ప్రజల వద్దకు : రాజకీయ నిర్ణయాలు తీసుకునేంతగా శక్తి, అధికారం తమిళనాడు బీజేపీకి లేదన్నారు. అధిష్టానం తీసుకునే తుది తీర్మానం మీద ఆధారపడాల్సి ఉందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు.
సినిమా వాళ్ల వద్దకు వెళ్లడం కాకుండా ప్రజల వద్దకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని రాష్ట్ర నాయకులకు హితవుపలికారు. స్వామి వ్యాఖ్యలు రాష్ట్ర కమలనాథుల్లో మంటలు రేపుతున్నాయి. అదే సమయంలో రజనీ అభిమానులు సైతం ఈ వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలించే పనిలో పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా, జాలర్లకు, ఈలం తమిళులకు వ్యతిరేకంగా ఇది వరకు వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురైన స్వామి తాజాగా రజనీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. భద్రత పెంపు : రాష్ర్టంలో అన్నాడీఎంకే వర్గాలు, జాలర్లు, తమిళ సంఘాలు సుబ్రమణ్య స్వామిపై గుర్రుగా ఉన్నాయి. ఆయన్ను రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా చేయడమే లక్ష్యంగా హెచ్చరికలు చేశారుు. ఆయన ఇంటిపై సైతం దాడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం అర్ధరాత్రి చెన్నైకి రావాలని సుబ్రమణ్య స్వామి నిర్ణయించారు. దీంతో ఆయనకు భద్రతను పెంచుతూ పోలీసు యంత్రాంగం ఆదేశాలు ఇవ్వడం కొసమెరుపు.