న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సహా మూడు ట్రస్టుల్లో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై విచారణకు సిద్ధమైంది. మనీ ల్యాండరింగ్, విదేశీ నిధుల ఆరోపణలకు సంబంధించిన విచారణను సమన్వయపరచడానికి అంతర్ మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ విషయాన్ని బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక డైరెక్టర్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లకు వచ్చే నిధుల్లో మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), ఆదాయపు పన్ను చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌ఆర్‌సీఏ) వంటి చట్టాలను ఉల్లంఘించినట్టుగా ఆరోపణలు న్న విషయం తెలిసిందే. వీటిపై విచారణకు అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ అధికారి చెప్పారు.
భారత్, చైనా సరిహద్దు వివాదం రాజుకున్న నేపథ్యంలో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి భారీగా విరాళాలు అందాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధికి చైనా కంపెనీల నుంచి విరాళాలు అందాయంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. చైనా సైన్యం మన భూభాగంలోకి రాలేదంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టిన కాంగ్రెస్ మోదీ చైనాకు లొంగిపోయారంటూ ఆరోపణలు గుప్పించింది. ఇదంతా జరిగిన పదిహేను రోజుల్లోనే ట్రస్టుల్లో విచారణకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది.
ప్రపంచమంతా మోదీలాగే ఉండదు : రాహుల్
గాంధీ కుటుంబ ట్రస్టులపై విచారణకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి తాము పోరాటం చేస్తున్న నేపథ్యంలో తమన ఎవరూ భయపెట్టలేరని అన్నారు. ‘‘ప్రధాని మోదీ ప్రపంచమంతా తనలాగే ఉంటుందని అనుకుంటారు. ప్రతీ ఒక్కరికీ ధర ఉంటుందని, వారిని బెదిరించవచ్చునని భావిస్తారు. నిజాలు వెలికి తీయడం కోసం పోరాడేవారిని ఎవరూ కొనలేరు.
ఈ విషయం ఆయనకి ఎప్పటికీ అర్థం కాదు’అని రాహుల్ ట్వీట్ చేశారు. కేంద్రం ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తూ గుడ్డిగా వెళుతోందని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ట్రస్టులపై విచారణకు సిద్ధమైన కేంద్రం కాషాయ ట్రస్టుల్ని ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ఎలాంటి భయం లేదని ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తామన్నారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణల్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు తోసిపుచ్చారు.
సోనియా ఆధ్వర్యంలోనే ట్రస్టులు
నిరక్షరాస్యతను పారద్రోలడం ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం కోసం 1991లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఆధునిక భారత పురోగతి, సమానత్వ సాధన కోసం రాజీవ్ కన్న కలల్ని సాకారం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ట్రస్టుకి చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ వ్యవహరిస్తూ ఉంటే, ట్రస్టీలుగా మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఉన్నారు.
రాజీవ్‌గాంధీ చారిటబుల్ ట్రస్ట్ గ్రామీణ భారత్‌లో నిరుపేదల అభ్యున్నతి కోసం 2002లో ఏర్పాటుచేశారు. ఉత్తరప్రదేశ్, హరియాణాలో ఈ ట్రస్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనికి సోనియా చైర్‌పర్సన్‌గా ఉంటే, రాహుల్, అశోక్ గంగూలీ, బన్సీ మెహతా సభ్యులుగా ఉన్నారు. మెగసెసె అవార్డు గ్రహీత దీప్ జోషి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2001లో ప్రారం భమైన ఇందిరాగాంధీ మెమో రియల్ ట్రస్ట్ విద్యారంగంలో కార్యక లాపాలు నిర్వహిస్తోంది. ఇందిరాగాంధీ పేరుతో పలు ఇంజనీరింగ్, డెంటల్ కళాశాలలను ఏర్పా టు చేసింది. ఈ ట్రస్ట్ సోనియా ఆధ్వర్యంలోనే నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment