Rajiv Gandhi Foundation
-
రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా విరాళాలెలా వచ్చాయి? ..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి విరాళాలు వస్తున్నాయని కేంద్ర యువజన, క్రీడలు, సమాచార శాఖమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ ఆరోపించారు. ఈ చందాలు ఎవరెవరు ఇచ్చారు? ఎందుకిచ్చారో రాహుల్‌గాంధీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు చైనా భారత్‌లో దురాక్రమణకు పాల్పడుతున్నప్పుడు రాహుల్‌గాంధీ చైనా అధికారులతో కలిసి విందులో పాల్గొన్నారని, ఆ విందు కేంద్రంగా ఎలాంటి ప్రణాళికలు రచించారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి అనురాగ్‌సింగ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ మన దేశ సైనికులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, జర్నలిస్టులకు ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రానికి ఎన్నో స్టార్టప్ కంపెనీలు, పెట్టుబడులు వస్తున్నాయని, తెలంగాణకు మాత్రం రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సలెన్సీ కేంద్రాలు తెరుస్తామని చెప్పారు. (చదవండి: అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో డ్రామా!) -
చైనా రాయబారుల నుంచి కాంగ్రెస్ నేతలకు డబ్బులు: అమిత్ షా
న్యూఢిల్లీ: సరిహద్దులో సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో విపక్షాలు ఆందోళన చేయటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు. తవాంగ్ ఘర్షణను చూపుతూ కాంగ్రెస్ మరేదో అంశంపై ఈ విధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. చైనా రాయబారుల వద్ద కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లో ఖర్చు చేశారని ఆరోపించారు. ‘సరిహద్దు ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేసినప్పటికీ ప్రశ్నోత్తరాల సమయానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది. నేను ప్రశ్నోత్తరాల జాబితాను చూశాను. 5వ ప్రశ్న తర్వాత కాంగ్రెస్ అత్యుత్సాహం కనిపించింది. ఆ ప్రశ్నను కాంగ్రెస్ సభ్యుడే అడిగారు. సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ వారు సభకు అంతరాయం కలిగించారు. వారు అనుమతించి ఉంటే నేను సమాధానం ఇచ్చేవాడిని. 2006-06, 2006-07 మధ్య చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు రూ 1.35 కోట్లు అందాయి. అది ఎఫ్సీఆర్ఏ ప్రకారం సరైనది కాదు. నిబంధనల ప్రకారమే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను హోంశాఖ రద్దు చేసింది. నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేదని స్పష్టం చేస్తున్నా.’ అని తెలిపారు హోంమంత్రి అమిత్ షా. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: చైనా కుతంత్రానికి దీటుగా బదులిచ్చిన భారత బలగాలు: రాజ్‌నాథ్ -
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కి విదేశీ నిధుల లైసెన్స్‌ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కి ఉన్న విదేశీ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్‌ని కేంద్రం రద్దు చేసింది. ఇది గాంధీ కుటుంబాలకు చెందిన ప్రభుత్వేతర సంస్థ. ఐతే ఈ సంస్థ విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించిందని, అందువల్ల ఈ లైసెన్స్‌ని రద్దు చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూలై 2020లో ఎంహెచ్ఏ దీనిపై ఒక కమిటి నియమించి, వారి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేగాదు లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆర్జీఈఎఫ్ కార్యాలయానికి నోటీసులు జారీ చేశామని కూడా తెలిపింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఫౌండేషన్‌కి చైర్ పర్సన్ కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరం, పార్లమెంట్ సభ్యులు రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ట్రస్ట్ సభ్యులు. ఈ ఫౌండేషన్‌ని 1991లో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫౌండేషన్ 1991 నుంచి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్, టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు మద్దతుతో సహా అనేక క్లిష్టమైన సమస్యలపై పనిచేసింది. పైగా విద్యా రంగానికి సంబంధించి పలు సేవలు అందించింది. (చదవండి: తెలంగాణలోకి రాహుల్ యాత్ర.. జోడో యాత్ర ఇలా కొనసాగుతుంది..) -
గాంధీ కుటుంబ ట్రస్టులపై విచారణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సహా మూడు ట్రస్టుల్లో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై విచారణకు సిద్ధమైంది. మనీ ల్యాండరింగ్, విదేశీ నిధుల ఆరోపణలకు సంబంధించిన విచారణను సమన్వయపరచడానికి అంతర్ మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక డైరెక్టర్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లకు వచ్చే నిధుల్లో మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), ఆదాయపు పన్ను చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్ఆర్సీఏ) వంటి చట్టాలను ఉల్లంఘించినట్టుగా ఆరోపణలు న్న విషయం తెలిసిందే. వీటిపై విచారణకు అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ అధికారి చెప్పారు. భారత్, చైనా సరిహద్దు వివాదం రాజుకున్న నేపథ్యంలో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి భారీగా విరాళాలు అందాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ నిధికి చైనా కంపెనీల నుంచి విరాళాలు అందాయంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. చైనా సైన్యం మన భూభాగంలోకి రాలేదంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టిన కాంగ్రెస్ మోదీ చైనాకు లొంగిపోయారంటూ ఆరోపణలు గుప్పించింది. ఇదంతా జరిగిన పదిహేను రోజుల్లోనే ట్రస్టుల్లో విచారణకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ప్రపంచమంతా మోదీలాగే ఉండదు : రాహుల్ గాంధీ కుటుంబ ట్రస్టులపై విచారణకు కేంద్రం కమిటీ ఏర్పాటు చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి తాము పోరాటం చేస్తున్న నేపథ్యంలో తమన ఎవరూ భయపెట్టలేరని అన్నారు. ‘‘ప్రధాని మోదీ ప్రపంచమంతా తనలాగే ఉంటుందని అనుకుంటారు. ప్రతీ ఒక్కరికీ ధర ఉంటుందని, వారిని బెదిరించవచ్చునని భావిస్తారు. నిజాలు వెలికి తీయడం కోసం పోరాడేవారిని ఎవరూ కొనలేరు. ఈ విషయం ఆయనకి ఎప్పటికీ అర్థం కాదు’అని రాహుల్ ట్వీట్ చేశారు. కేంద్రం ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తూ గుడ్డిగా వెళుతోందని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ట్రస్టులపై విచారణకు సిద్ధమైన కేంద్రం కాషాయ ట్రస్టుల్ని ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ఎలాంటి భయం లేదని ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తామన్నారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణల్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్ రావు తోసిపుచ్చారు. సోనియా ఆధ్వర్యంలోనే ట్రస్టులు నిరక్షరాస్యతను పారద్రోలడం ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం కోసం 1991లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఆధునిక భారత పురోగతి, సమానత్వ సాధన కోసం రాజీవ్ కన్న కలల్ని సాకారం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ట్రస్టుకి చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ వ్యవహరిస్తూ ఉంటే, ట్రస్టీలుగా మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఉన్నారు. రాజీవ్‌గాంధీ చారిటబుల్ ట్రస్ట్ గ్రామీణ భారత్‌లో నిరుపేదల అభ్యున్నతి కోసం 2002లో ఏర్పాటుచేశారు. ఉత్తరప్రదేశ్, హరియాణాలో ఈ ట్రస్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనికి సోనియా చైర్‌పర్సన్‌గా ఉంటే, రాహుల్, అశోక్ గంగూలీ, బన్సీ మెహతా సభ్యులుగా ఉన్నారు. మెగసెసె అవార్డు గ్రహీత దీప్ జోషి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2001లో ప్రారం భమైన ఇందిరాగాంధీ మెమో రియల్ ట్రస్ట్ విద్యారంగంలో కార్యక లాపాలు నిర్వహిస్తోంది. ఇందిరాగాంధీ పేరుతో పలు ఇంజనీరింగ్, డెంటల్ కళాశాలలను ఏర్పా టు చేసింది. ఈ ట్రస్ట్ సోనియా ఆధ్వర్యంలోనే నడుస్తోంది. -
‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా?
న్యూఢిల్లీ: ప్రధాని సహాయ నిధి నుంచి యూపీఏ హయాంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కు నిధులు మళ్లించినట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం స్పందిచారు. బీజేపీ అన్నీ అర్థ సత్యాలే మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో చిదంబరం మాట్లాడుతూ.. ‘బీజేపీ ఆరోపణల మేరకు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ఇచ్చిన రూ. 20 లక్షలు తిరిగి ఇచ్చేస్తుంది. అలానే బీజేపీ చైనా ఆక్రమణలను తొలగించి.. సరిహద్దులో యథాతథ స్థితిని తిరిగి తీసుకురాగలమని దేశ ప్రజలకు హామీ ఇవ్వగలదా’ అని ప్రశ్నించారు. (రాజీవ్ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు) 2005లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్జీఎఫ్కు 20 లక్షలు బదిలీ చేశారు. దీన్ని నడ్డా తప్పుపట్టడాన్ని చిదంబరం వ్యతిరేకించారు. ఆ డబ్బును సునామీతో దెబ్బతిన్న అండమాన్ దీవుల్లో ఖర్చు చేసినట్లు చిదంబరం వెల్లడించారు. ప్రస్తుతం బీజేపీ ‘భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు’ అంశంపై ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు వాస్తవికతకు అనుగుణంగా సమాధానం ఇవ్వడంపై దృష్టి పెట్టాలని చిదంబరం కోరారు. అంతేకాక ఆర్జీఎఫ్ నిధులకు, చైనా ఆక్రమణకు ఏం సంబంధం ఉందని చిదంబరం ప్రశ్నించారు. ఒకవేళ ఆ డబ్బును ఇప్పుడు తిరిగిస్తే, తాజాగా చైనా ఆక్రమించిన భూభాగాన్ని ప్రధాని మోదీ తీసుకురాగలరా అని ఆయన బీజేపీని ప్రశ్నించారు. ఆర్జీఎఫ్కు విరాళాలు ఇస్తున్న చైనా ఎంబసీ ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నట్లే అని బీజేపీ ఆరోపించింది. చైనా సంక్షోభం నుంచి దారి మళ్లించేందుకు బీజేపీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు చిదంబరం మండిపడ్డారు -
రాజీవ్ ఫౌండేషన్‌కి ‘ప్రధాని’ నిధులు
న్యూఢిల్లీ : బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. యూపీఏ హయాంలో గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి భారీగా నిధులు అందాయని బీజేపీ ఆరోపించింది. ప్రధాని సహాయ నిధికి వచ్చి డబ్బుని రాజీవ్ ఫౌండేషన్‌కు మళ్లించ డం దేశ ప్రజల్ని దారుణంగా మోసం చేయడమేనని బీజేపీ జాతీయ అ«ధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని సహాయ నిధి నుంచి నిధుల మళ్లింపునకు సంబంధించి డాక్యుమెంట్లను కూడా ఆయన బయటపెట్టారు. ‘‘కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రధాని సహాయ నిధికి వచ్చిన నిధుల్ని యూపీఏ హయాంలో రాజీవ్ ఫౌండేషన్‌కు మళ్లించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ బోర్డు సమావేశాల్లో అప్పట్లో సోనియాయే కూర్చొనేవారు. ఆర్‌జీఎఫ్‌కి ఆమే చైర్ పర్సన్. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడినందుకు సోనియా బాధ్యత వహించాలి’’అని నడ్డా ట్వీట్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన సొమ్ముల్ని ఒక కుటుంబానికి ధారపోయడం అంటే దేశ ప్రజల్ని పచ్చి దగా దేయడమేనని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా నడ్డా ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టింది. -
రాజీవ్ గాంధీ ఫౌండేషన్: పెద్ద మోసం
సాక్షి, న్యూఢిల్లీ : సోనియా గాంధీ కుటుంబం ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి(పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నిధులు మళ్లించిందని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రజలు ఇచ్చిన డబ్బులను వ్యక్తిగత ఫౌండేషన్‌కు ఎలా మళ్లిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘యూపీఏ హయాంలో నిధుల మళ్లింపు మోసం జరిగింది. ప్రజల డబ్బులను కుటుంబ సంస్థకు మళ్లించడం పెద్ద మోసం. సోనియా కుటుంబం ధనార్జన కోసం అధికారాన్ని వాడుకుంది. ఈ లూటీపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ( కాంగ్రెస్, చైనా మధ్య ఎందుకీ బంధం! ) PMNRF, meant to help people in distress, was donating money to Rajiv Gandhi Foundation in UPA years. Who sat on the PMNRF board? Smt. Sonia Gandhi Who chairs RGF? Smt. Sonia Gandhi. Totally reprehensible, disregarding ethics, processes and not bothering about transparency. pic.twitter.com/tttDP4S6bY — Jagat Prakash Nadda (@JPNadda) June 26, 2020 కాగా, రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా రాయబార కార్యాలయం నుంచి దాదాపు 90 లక్షల రూపాయలు విరాళంగా అందాయని ఆ నిధుల్ని ఎందుకు తీసుకుందో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని గురువారం న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 2005-06లో ఈ నిధులు ఫౌండేషన్‌కు అందినట్టుగా ఆ సంస్థ వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఉందన్నారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తూ ఉంటే రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బోర్డు సభ్యులుగా ఉన్నారని అన్నారు. -
కాంగ్రెస్, చైనా మధ్య ఎందుకీ బంధం!
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా రాయబార కార్యాలయం నుంచి దాదాపురూ.90 లక్షలు విరాళంగా అందాయని ఆ నిధుల్ని ఎందుకు తీసుకుందో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని∙న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. 2005–06లో ఈ నిధులు ఫౌండేషన్‌కు అం దినట్టుగా ఆ సంస్థ వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఉందన్నారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు కాం గ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా వ్యవ హరిస్తూ ఉంటే రాహుల్ గాంధీ, కుమార్తె ప్రి యాంకా, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బోర్డు సభ్యులుగా ఉన్నారు. భూములిచ్చారు, విరాళాలు తీసుకున్నారు 2005–06లో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి నిధులు అందిన తర్వాతే, ఆ ఫౌండేషన్ చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోమని సిఫారసు చేసిన విషయం నిజం కాదా? అని రవిశంకర్ ప్రశ్నించారు. ఎఫ్టీఏతో భారత్ ఆర్థికంగా నష్టపోతే, చైనాకు అపారమైన లబ్ధి చేకూరందన్నారు. కాంగ్రెస్, చైనా మధ్య రహస్య సంబంధాలు మధ్యప్రదేశ్‌లో జన సంవాద్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్, చైనా మధ్య రహస్య సంబంధాలున్నాయని ఆరోపించారు. 2008లో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని, ఆ ఒప్పందాన్ని కుదర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.ఒప్పందంపై విచారణ చేయాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. డోక్లాం వివాదం సమయంలో రాహుల్ చైనా వెళ్లి మన సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తప్పుదోవ పట్టిస్తున్నారా? : కాంగ్రెస్ లద్దాఖ్‌లోని భారత్ భూభాగంలోకి చైనా బలగాలు ప్రవేశించలేదంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తూ జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. గల్వాన్ లోయలోకి చైనా ఆర్మీ ప్రవేశించినట్టు నిపుణులు చెబుతున్నారని, దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు వస్తున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. -
'రాజీవ్‌గాంధీ'కి జకీర్ నుంచి భారీగా నిధులు
-
'రాజీవ్‌గాంధీ'కి జకీర్ నుంచి భారీగా నిధులు
భోపాల్: వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్) నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు రూ. 50 లక్షల నిధులు 2011లో అందినట్టు తేలింది. ఈ మేరకు విరాళాలు అందినమాట వాస్తవమేనని, అయితే ఇవి నేరుగా ఆర్జీఎఫ్కు కాకుండా దాని అనుబంధ సంస్థ అయిన రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)కి అందినట్టు కాంగ్రెస్ పార్టీ ధ్రువీకరించింది. అయితే, కొన్ని నెలల కిందట ఈ సొమ్మును వాపస్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఉగ్రవాదులను ప్రేరేపించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌పై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జకీర్ సంస్థ నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు నిధులు అందినట్టు తేలడం కలకలం రేపుతోంది. అయితే, ఈ విషయమై 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికతో స్పందించిన ఆర్జీఎఫ్ తాను ఐఆర్ఎఫ్ నుంచి విరాళాలు పొందలేదని చెప్పుకొచ్చింది. జకీర్‌కు చెందిన ఐఆర్ఎఫ్ ప్రతినిధులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. 2011లో నేరుగా రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు తాము రూ. 50 లక్షలు ఇచ్చామని వారు స్పష్టం చేశారు. ఆ నిధులను ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని, ఒకవేళ తిరిగి ఇవ్వాలని వారు అనుకుంటూ ఉండవచ్చునని ఐఆర్ఎఫ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ (ఆర్జీసీటీ)కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె పిల్లలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ స్థాపక సభ్యులుగా ఉండగా, ఆర్జీఎఫ్కు వారితోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సైతం స్థాపక సభ్యుడిగా ఉన్నారు. -
కరిజ్మా లేని రాహుల్
అందుకే తెరపైకి ప్రియాంక అయినా యూపీఏకు ఓటమి తప్పదు ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించలేని దుస్థితిలో కాంగ్రెస్ దమ్ముంటే వెంటనే అభ్యర్థి పేరు ప్రకటించాలి ఆ పార్టీకి 80 స్థానాల్లోపే సిద్దు పాలనలో కర్ణాటక అధోగతి మోడీ పీఎం అయితే బళ్లారిలో సోలార్ కారిడార్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ రాష్ర్టంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ బళ్లారిలో, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోలార్, మైసూర్‌లలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఒకరి పార్టీపై మరొకరు విమర్శలు గుప్పించారు. రాహుల్‌కు కరిజ్మా లేదని, అందుకే కాంగ్రెస్ నేతలు ప్రియాంకను తెరపైకి తెస్తున్నారని రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించగా.. గుజరాత్లో మోడీది దుష్ట పాలన అంటూ సోనియా ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు చెబుతున్న అభివృద్ధి గుజరాత్లో ఎక్కడా కనిపించదని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని తూర్పారబట్టారు. సోనియాగాంధీ ఛైర్మన్‌గా ఉన్న రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ గుజరాత్లో అద్భుత పాలన సాగిస్తున్నారంటూ కితాబు ఇచ్చిన విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో గుర్తు చేశారు. సాక్షి, బళ్లారి : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌కు కరిజ్మా లేదని, అందుకే కాంగ్రెస్ నేతలు ప్రియాంకను తెరపైకి తెస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు తరఫున ప్రచారం నిర్వహించేందుకు బుధవారం బళ్లారికి విచ్చేసిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశాన్ని 55 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించలేని స్థితిలో ఉందన్నారు. బీజేపీ తరుపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు ప్రకటించామని, అయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ పేరు ధైర్యంగా ప్రకటించలేని దుస్థితిలో ఉందని అన్నారు. ఈ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70-80 స్థానాలకే సరిపెట్టుకుంటుందన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలోనే ధరలు, అవినీతి విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా మోడీ ప్రధానమంత్రి కావడాన్ని అడ్డుకోలేదన్నారు. రాష్ర్టంలో యడ్యూరప్ప ఉత్తమ పాలన అందించారని కొనియాడారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలతో కర్ణాటకను ముందంజలోకి తీసుకెళ్లారన్నారు. అయితే సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక రాష్ర్టంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉత్తమ పాలన అందుతోందని, గుజరాత్లో అద్భుత పాలన సాగిస్తున్నారని రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ కితాబు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ సంస్థకు సోనియాగాంధీ ఛైర్మన్‌గా ఉన్నారనే విషయం అందరికి తెలిసిందేనన్నారు. గుజరాత్ పాలన కాంగ్రెస్ నేతలు కొనియాడుతున్నారంటే మోడీకి ఎంత ప్రజాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. బళ్లారి లోక్‌సభ అభ్యర్థి బీ.శ్రీరాములు గెలుపొందితే తుంగభద్ర డ్యాంలో పూడిక తీసేందుకు వీలవుతుందన్నారు. మోడీ ప్రధాని అయితే బళ్లారిలో సోలార్ కారిడార్ ఏర్పాటు చేయడంతోపాటు.. ఉక్కు జిల్లాగా మార్చేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ సీఎం యడ్యూరప్ప, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత్‌కుమార్, బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, ఎంపీలు శాంత, సన్నపక్కీరప్ప, విధాన పరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగా, ఎమ్మెల్యే రాజీవ్ కుడిచి, మాజీ మంత్రి రాజుగౌడ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.