కరిజ్మా లేని రాహుల్ | Rahul does not karijma | Sakshi
Sakshi News home page

కరిజ్మా లేని రాహుల్

Published Thu, Apr 10 2014 1:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

కరిజ్మా లేని రాహుల్ - Sakshi

కరిజ్మా లేని రాహుల్

  •  అందుకే తెరపైకి ప్రియాంక
  •  అయినా యూపీఏకు ఓటమి తప్పదు
  •  ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించలేని  దుస్థితిలో కాంగ్రెస్  
  •  దమ్ముంటే వెంటనే అభ్యర్థి పేరు ప్రకటించాలి
  •  ఆ పార్టీకి 80 స్థానాల్లోపే
  •  సిద్దు పాలనలో కర్ణాటక అధోగతి
  •  మోడీ పీఎం అయితే బళ్లారిలో సోలార్ కారిడార్  
  •  బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్
  •  రాష్ర్టంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ బళ్లారిలో, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోలార్, మైసూర్‌లలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఒకరి పార్టీపై మరొకరు విమర్శలు గుప్పించారు. రాహుల్‌కు కరిజ్మా లేదని, అందుకే కాంగ్రెస్ నేతలు ప్రియాంకను తెరపైకి తెస్తున్నారని రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించగా.. గుజరాత్‌లో మోడీది దుష్ట పాలన అంటూ సోనియా ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు చెబుతున్న అభివృద్ధి గుజరాత్‌లో ఎక్కడా కనిపించదని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని తూర్పారబట్టారు. సోనియాగాంధీ ఛైర్మన్‌గా ఉన్న రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ గుజరాత్‌లో అద్భుత పాలన సాగిస్తున్నారంటూ కితాబు ఇచ్చిన విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో గుర్తు చేశారు.
     
    సాక్షి, బళ్లారి : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌కు కరిజ్మా లేదని, అందుకే కాంగ్రెస్ నేతలు ప్రియాంకను తెరపైకి తెస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు తరఫున ప్రచారం నిర్వహించేందుకు బుధవారం బళ్లారికి విచ్చేసిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశాన్ని 55 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించలేని స్థితిలో ఉందన్నారు. బీజేపీ తరుపున ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరు ప్రకటించామని, అయితే కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ పేరు ధైర్యంగా ప్రకటించలేని దుస్థితిలో ఉందని అన్నారు.

    ఈ ఎన్నికల  అనంతరం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70-80 స్థానాలకే సరిపెట్టుకుంటుందన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలోనే ధరలు, అవినీతి విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా మోడీ ప్రధానమంత్రి కావడాన్ని అడ్డుకోలేదన్నారు. రాష్ర్టంలో యడ్యూరప్ప ఉత్తమ పాలన అందించారని కొనియాడారు.

    రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలతో కర్ణాటకను ముందంజలోకి తీసుకెళ్లారన్నారు. అయితే సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక రాష్ర్టంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉత్తమ పాలన అందుతోందని, గుజరాత్‌లో అద్భుత పాలన సాగిస్తున్నారని రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ కితాబు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ సంస్థకు సోనియాగాంధీ ఛైర్మన్‌గా ఉన్నారనే విషయం అందరికి తెలిసిందేనన్నారు.

    గుజరాత్ పాలన కాంగ్రెస్ నేతలు కొనియాడుతున్నారంటే మోడీకి ఎంత ప్రజాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. బళ్లారి లోక్‌సభ అభ్యర్థి బీ.శ్రీరాములు గెలుపొందితే తుంగభద్ర డ్యాంలో పూడిక తీసేందుకు వీలవుతుందన్నారు. మోడీ ప్రధాని అయితే బళ్లారిలో సోలార్ కారిడార్ ఏర్పాటు చేయడంతోపాటు.. ఉక్కు జిల్లాగా మార్చేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.

    కార్యక్రమంలో మాజీ సీఎం యడ్యూరప్ప, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత్‌కుమార్, బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, ఎంపీలు శాంత, సన్నపక్కీరప్ప, విధాన పరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగా, ఎమ్మెల్యే రాజీవ్ కుడిచి, మాజీ మంత్రి రాజుగౌడ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement