టార్గెట్ అహ్మద్ పటేల్!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో సోనియా, రాహుల్ గాంధీల తర్వాత మూడో స్థానంలో ఉన్న సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకుందా? గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పటేల్ ఓటమి కోసం పావులు కదుపుతోందా? దీని కోసమే మూడో అభ్యర్థిని బరిలోకి దించిందా? గుజరాత్ రాజకీయ పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి!
ఓడితే కాంగ్రెస్ లోపలా ప్రభావం..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు సుదీర్ఘకాలంగా సలహాదారుగా ఉన్న పటేల్ ఇందిర, రాజీవ్, పీవీ నరసింహారావుల హయాం నుంచి పార్టీలో ఒక వెలుగు వెలుగుతున్నారు. కాంగ్రెస్‌లో సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేత ఆయన. రాహుల్ వర్గానికి పటేల్‌తో పొసగడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఐదోసారి రాజ్యసభకు పోటీ చేస్తున్న పటేల్‌ను ఓడిస్తే కాంగ్రెస్ అంతర్గత సమీకరణాల్లో భారీ మార్పులు వస్తాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే గుజరాత్‌లో కాంగ్రెస్‌కి భారీ దెబ్బ తగులుతుంది.
దీని కోసం కాషాయ దళం.. కాంగ్రెస్‌ను చీల్చి, మూడో అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఇప్పటికే గుజరాత్ నుంచి తమ రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలను ప్రకటించిన బీజేపీ మూడో అభ్యర్థిగా.. గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తమ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను పోటీలో నిలిపింది. రాజ్‌పుత్.. వారం కిందట కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలాకు బంధువు. రాజ్‌పుత్ సహా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు శుక్రవారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో 182 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 51కి పడిపోయింది. మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి ప్లేటు ఫిరాయించే అవకాశముంది.
అహ్మద్ పటేల్ గెలవాలంటే 47 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీని కోసం కాంగ్రెస్ మరింత మంది గోడదూకకుండా చూసుకోవాలి. కాంగ్రెస్‌కు ఒక జేడీయూ, ఇద్దరు ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే తాజా పరిణామాలు పార్టీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసంతృప్తులను పటేల్ శాంతపరుస్తున్నా ఫలితం లేకపోతోంది. ఇటీవలి రాష్ట్రపతి ఎన్నికల్లో వాఘేలా వర్గానికి చెందిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ అభ్యర్థి మీరా కుమార్‌కు కాకుండా ఎన్డీఏ అభ్యర్థి కోవింద్‌కు ఓటేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీలతో పాటు ఇటీవలే కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన బల్వంత్ సింగ్ రాజ్‌పుత్‌లు రాజ్యసభకు నామినేషన్లను దాఖలు చేశారు. స్మృతి ఇరానీ రాజ్యసభ సభ్యత్వం ఆగస్టు 18 తో ముగియనుంది.