విషం చిమ్ముతున్న మోదీ సర్కార్!
- నెహ్రూ జయంతి కార్యక్రమంలో సోనియా, రాహుల్ పరోక్ష వ్యాఖ్యలు
- దేశ పునాదులను కూల్చుతున్నారనిమోదీపై ధ్వజం
- నెహ్రూ దేశానికే కలికితురాయి: ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు, ఎన్డీఏయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ లౌకికవాద నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి నేపథ్యంలో గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు కార్యక్రమాలను ఇందుకు వేదికగా చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీపై పరోక్షంగా మాటల యుద్ధానికి దిగింది.
మోదీ దేశంలో మతతత్వమనే విషాన్ని చిమ్ముతున్నారని ఆరోపించింది. నెహ్రూ నిర్మించిన స్వేచ్ఛా భారతాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. మోదీ పేరును ప్రస్తావించకుండానే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయనపై విమర్శలు గుప్పించారు. తొలుత పార్టీ కార్యక్రమంలో సోనియా మాట్లాడుతూ ‘నెహ్రూ దార్శనికత ను దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆయన వ్యక్తిత్వాన్నే కాదు, ఆయన భావజాలం, దృ క్పథం, జీవితకాల పోరాటం, ఆయన సేవలను కొన్ని శక్తులు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. నెహ్రూ ఇప్పుడు బతికి ఉంటే మతతత్వం నుంచి దేశాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ లౌకిక సైనికుడై పోరాడాలని పిలుపునిచ్చేవారు’ అని వ్యాఖ్యానించారు. నెహ్రూ సమర్థ నాయకత్వం వల్లే భారత్ ప్రస్తుతం అనేక రంగాల్లో దూసుకుపోతోందన్నారు. అనంతరం జరిగిన 46వ నెహ్రూ స్మారకోపన్యాస కార్యక్రమంలో నెహ్రూ స్మారక ఉపన్యాసం చేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోనియా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెహ్రూ నిర్మించిన స్వేచ్ఛా భారత్‌ను కూలదోస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాడాలని, ఆయన ఆలోచనలను కాపాడేందుకు నిరంతరం పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశ రాజకీయాలను అర్థం చేసుకోవడంలో ప్రణబ్ అపార అనుభవం గలవారని సోనియా కొనియాడారు. ఈ ఏడాది నెహ్రూ స్మారకోపన్యాసాన్ని ఇచ్చేందుకు ప్రణబ్‌కు మించిన గొప్ప వ్యక్తిత్వంగలవారు లేరని ప్రశంసించారు. అంతకుముందు పార్టీ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ మోదీ తీరును తప్పుబట్టారు. కోపోద్రిక్తులు దేశాన్ని పాలిస్తున్నారని, స్వచ్ఛ భారత్ పేరుతో ఫొటోలకు పోజులిస్తున్నారని వ్యాఖ్యానించారు.
‘ఈ రోజుల్లో ప్రేమ, సౌభ్రాతృత్వం అనే పునాదులను కూలగొడుతున్నారు. మరోవైపు ఇళ్లకు రంగులేస్తున్నారు. రోడ్లను శుభ్రం చేస్తున్నారు. ఫొటోలు దిగుతున్నారు. ఇంకోవైపు దేశ పునాదులను కూల్చుతూ విషాన్ని వ్యాపింపజేస్తున్నారు’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసినప్పటికీ.. పార్టీ సిద్ధాంతాల్లో ఎలాంటి తప్పు లేదని, ప్రేమ, సౌభ్రాతృత్వాలతో నిండినదని పేర్కొన్నారు. ఎన్నికల హామీలేవీ నెరవేరడం లేదని, ఫొటోలు మాత్రం దిగుతున్నారని మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు.
నెహ్రూ వల్లే దేశాభివృద్ధి: ప్రణబ్
నెహ్రూ దార్శనికత వల్లే దేశం ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని రాష్ట్రపతి ప్రణబ్ కీర్తించారు. ఆయన 46వ నెహ్రూ స్మారకోపన్యాసం చేస్తూ నెహ్రూను దేశానికే కలికితురాయిగా అభివర్ణించారు. నెహ్రూ వేసిన పునాదుల వల్లే నేడు భారత్ బలమైన ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతోందని కొనియాడారు.