'రాజీవ్‌గాంధీ'కి జకీర్ నుంచి భారీగా నిధులు
భోపాల్: వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్) నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు రూ. 50 లక్షల నిధులు 2011లో అందినట్టు తేలింది. ఈ మేరకు విరాళాలు అందినమాట వాస్తవమేనని, అయితే ఇవి నేరుగా ఆర్జీఎఫ్‌కు కాకుండా దాని అనుబంధ సంస్థ అయిన రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్(ఆర్జీసీటీ)కి అందినట్టు కాంగ్రెస్ పార్టీ
ధ్రువీకరించింది. అయితే, కొన్ని నెలల కిందట ఈ సొమ్మును వాపస్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఉగ్రవాదులను ప్రేరేపించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్‌పై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జకీర్ సంస్థ నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు నిధులు అందినట్టు తేలడం కలకలం రేపుతోంది. అయితే, ఈ విషయమై 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికతో స్పందించిన ఆర్జీఎఫ్ తాను ఐఆర్‌ఎఫ్ నుంచి విరాళాలు పొందలేదని చెప్పుకొచ్చింది.
జకీర్‌కు చెందిన ఐఆర్‌ఎఫ్ ప్రతినిధులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు. 2011లో నేరుగా రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు తాము రూ. 50 లక్షలు ఇచ్చామని వారు స్పష్టం చేశారు. ఆ నిధులను ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని, ఒకవేళ తిరిగి ఇవ్వాలని వారు అనుకుంటూ ఉండవచ్చునని ఐఆర్‌ఎఫ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ (ఆర్జీసీటీ)కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె పిల్లలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ స్థాపక సభ్యులుగా ఉండగా, ఆర్జీఎఫ్‌కు వారితోపాటు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సైతం స్థాపక సభ్యుడిగా ఉన్నారు.