జకీర్‌కు ఝలక్.. కోట్ల ఆస్తులు ఆటాచ్
న్యూఢిల్లీ: ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధానికి గురైన ఆయన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్‌ఎఫ్), ఇతరులకు చెందిన రూ.18.37కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002 కింద ఈ మొత్తం ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు తెలిపింది.
స్వచ్ఛంద సంస్థ పేరిట ఏర్పడిన ఐఆర్‌ఎఫ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగుపెట్టి అక్రమ మార్గాల్లో డబ్బును ఆర్జించిందని, ఆ డబ్బుతో దేశ వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే కుట్రలు చేసిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేర్చేందుకు పలువురుని ప్రోత్సహించడంతోపాటు, స్కాలర్‌షిప్పుల పేరిట అక్రమ కార్యకలాపాలకు పాల్పడేందుకు డబ్బు సాయం చేసేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. దేశంలో అల్లర్లు చోటుచేసుకునేలాగా జకీర్‌నాయక్ ప్రసంగాలు చేశారని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.