జకీర్‌నాయక్ డబ్బంతా దావూద్ ఇబ్రహీందేనా?
ముంబై: ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఎన్‌జీవోలోకి వచ్చిన నిధులన్నీ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంకు చెందినవేనా? కరాచీ నుంచి హవాలా రూపంలో వందల కోట్లు జకీర్ నాయక్‌కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్) అకౌంట్లకు తరలివచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఐఆర్‌ఎఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆమీర్ గజ్దర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. విచారణలో గజ్దర్ నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది.
దావూద్‌కు సన్నిహితుడైన వ్యక్తి ఐఆర్‌ఎఫ్ నుంచి హవాలా ద్వారా సౌదీ అరేబియా, యూకే, చిన్న ఆఫ్రికా దేశాలకు డబ్బును పంపినట్లు ఈడీ అనుమానిస్తోంది. కేసు దర్యాప్తు పూర్తయితే దేశంలో అతిపెద్ద హవాలా రాకెట్ గుట్టు బయటపడుతుందని ఈడీ అధికారి ఒకరు చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన సుల్తాన్ అహ్మద్ అనే వ్యక్తి ఐఆర్‌ఎఫ్, దావూద్‌ల మధ్యవర్తిగా ఉన్నట్లు తెలిపారు. 2012లో దుబాయ్‌లో సుల్తాన్ జకీర్‌ను కలిసినట్లు చెప్పారు. అప్పటినుంచి యూకే, ఆఫ్రికా దేశాల నుంచి డబ్బు ఐఆర్‌ఎఫ్‌కు వస్తున్నట్లు వెల్లడించారు.