స్కైప్ ద్వారా విచారణకు హాజరవుతా: నాయక్
ముంబై: నగదు అక్రమ తరలింపు(మనీ లాండరింగ్) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరవ్వడానికి సిద్ధమని వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ తెలిపాడు. అయితే స్కైప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాంగ్మూలం ఇస్తానని పేర్కొన్నాడు. ఈమేరకు తన లాయర్ మహేశ్ మ్యూల్ ద్వారా ఒక లేఖ పంపాడు. అందులో... ఎన్‌ఆర్‌ఐ అయిన తనకు ఈడీ నుంచి ఎలాంటి సమన్లు అందలేదని చెప్పాడు.
తనను ఫిబ్రవరి 9న హాజరవ్వాలని కోరుతూ తన సోదరునికి సమన్లు జారీచేయడం సరికాదని తెలిపాడు. భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తనపై నిష్పాక్షిక విచారణ జరగడం అసాధ్యమని అభిప్రాయపడ్డాడు. తన సంస్థ ఐఆర్‌ఎఫ్‌పై విధించిన నిషేధాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) ట్రిబ్యునల్‌లో సవాలు చేసినందున అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే దాకా ఐఆర్‌ఎఫ్‌పై ప్రశ్నించొద్దని విజ్ఞప్తి చేశాడు.
ఈడీ ముందు వ్యక్తిగతంగా హాజరవడానికి కొన్ని నెలల సమయం కోరాడు. జకీర్ నాయక్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందామని గతేడాది ఢాకాలో దాడికి పాల్పడిన కొందరు ఉగ్రవాదులు చెప్పడంతో అరెస్ట్ తప్పించుకోవడానికే అతను సౌదీ అరేబియాలో ఉంటున్నట్లు భావిస్తున్నారు.