![Delhi Excise Policy Scam Case: Arvind Kejriwal agrees to appear before ED via video conferencing - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/5/kejrival.jpg.webp?itok=OwW4bPjl)
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా ఎనిమిదోసారి పంపిన సమన్లకు కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదు. మార్చి 4వ తేదీన తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున సోమవారం విచారణకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు.
ఈడీ తనకు సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమే అయినా ఈనెల 12వ తేదీ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వర్చువల్‌గా హాజరయ్యేందుకు చట్టం హక్కు కలి్పంచింది. అందుకు ఈడీ అధికారులు అనుమతిస్తారని భావిస్తున్నా. ఈడీ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నేను డిమాండ్ చేయలేదు.
ఒకవేళ ప్రత్యక్ష ప్రసారం చేసినా అభ్యంతరం లేదు’అని కేజ్రీవాల్ అన్నారు. అయితే, కేజ్రీవాల్ పంపిన సమాధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే, కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా విచారించేందుకు సిద్ధంగా లేని ఈడీ..తొమ్మిదో విడత సమన్లు పంపే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించడం.. కేజ్రీవాల్ వినతి మేరకు మార్చి 16న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు ప్రకటించడం తెలిసిందే.
బీజేపీ ‘మోదీ కా పరివార్’ ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కేవలం కేంద్ర మంత్రులే మోదీ కుటుంబమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment