షాకింగ్.. ఉగ్రవాదికి జకీర్ స్కాలర్‌షిప్
న్యూఢిల్లీ: అనుకున్నట్లే అయ్యింది. వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆయన స్వచ్ఛంద సంస్థలపై దాడుల అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. జకీర్ నాయక్ కు ఇస్లామిక్ రీసెర్చ్ పౌండేషన్(ఐఆర్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ఉన్న విషయం తెలిసిందే. దీనినుంచి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు చెందిన అబూ అనాస్ అనే వ్యక్తికి రూ.80,000 స్కాలర్ షిప్పుగా అందించినట్లు ఎన్ఐఏ గుర్తించింది.
అనాస్ సిరియా వెళ్లి ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న సమయంలో అతడికి రాజస్థాన్ లోని టోంక్ లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలో ఉపకార వేతనం రూపంలో జమ చేసినట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది. అనాస్ తొలుత తనకు స్కాలర్ షిప్పు ఇవ్వాలంటూ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసు అతడిని ముంబయికి పిలిచి ఇంటర్వ్యూ చేసి ఈ డబ్బు మంజూరు చేశారు.
ప్రస్తుతం ఐసిస్‌లో చేర్పించేందుకు భారత్లోని యువకులను ప్రోత్సహించే పనులు చేస్తున్న అనాస్ను ఈ ఏడాది జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు. అతడు చెప్పిన సమాచారం ఆధారంగానే తాజాగా ఐఆర్ఎఫ్‌పై దాడులు చేయగా అసలు విషయం బయటపడింది. తాజా సమాచారంతో జకీర్ నాయక్ పై మరింత లోతుగా విచారణ చేసేందుకు ఎన్ఐఏకు అవకాశం చిక్కినట్లయింది.