న్యూఢిల్లీ: వీలైనంత త్వరగా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాల్సిందేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ డిమాండ్ చేశారు. ఈ దిశగా జరుగుతున్న చర్చలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రస్తుత సీజేఐ దీపక్ మిశ్రా పదవీ విరమణకు ముందే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో భాగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న ‘భవిష్యత్ భారతం: ఆరెస్సెస్ దృక్పథం’ కార్యక్రమం చివరి రోజు (మూడోరోజు) పలు అంశాలపై ఆయన సంఘ్ ఆలోచనలను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.
రామమందిరం, కోటా వ్యవస్థపై
రామమందిర నిర్మాణం త్వరగా జరగాలి. అయితే మందిర నిర్మాణ ఉద్యమాన్ని నడుపుతున్న ‘రామమందిర సమితి’దే తుది నిర్ణయం. ఈ అంశంపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చే విషయంపై (ఆహూతులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ) నాకు ఎలాంటి సమాచారం లేదు. వివిధ వర్గాలకు ఉద్దేశించిన ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థ బాగుంది.
జనాభా సంతులనం: ప్రపంచమంతా జనాభా సంతులనాన్ని పాటిస్తున్నారు. భారత్‌లోనూ ఇది అమలవ్వాల్సిందే. వచ్చే 50 ఏళ్లలో దేశ జనాభా ఎలా ఉండబోతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జనాభా విధానాన్ని సిద్ధం చేయాలి. ఒకసారి విధానాన్ని నిర్ణయించిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. ఇందులో సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములవ్వాలి. ఎక్కువ మంది సంతానం ఉండి.. వారిని పోషించేందుకు తక్కువ వనరులున్న వారినుంచే ఈ విధానం అమలు మొదలవ్వాలి.
హిందుత్వ, మత మార్పిడులపై..
ప్రపంచవ్యాప్తంగా హిందుత్వకు ఆమోదం పెరుగుతోంది. అయితే హిందుత్వలోని కొన్ని దురాచారాల వల్ల అక్కడక్కడ వ్యతిరేకత ఎదురవుతోంది. ఇలాంటి వాటిని తొలగించి ప్రజల్లో ఒకటేనన్న భావన కలిగించేందుకు సంఘ్ పనిచేస్తోంది. మత మార్పిడులకు ఆరెస్సెస్ వ్యతిరేకం. కుట్రపూరిత, దురుద్దేశాలతోనే మత మార్పిడులు జరుగుతున్నాయి. జనాభా అసంతులనానికి ఇదో కారణం.
‘గో సంరక్షణ’ దాడులు: గోసంరక్షణ జరిగి తీరాల్సిందే. కానీ దీని పేరుతో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటాన్ని అంగీకరించం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం.
మరిన్ని అంశాలపై..
ఏకాభిప్రాయంతో కులాంతర వివాహాలు జరిగితే సంఘ్ సమర్థిస్తుంది. ఇలాంటి ఎక్కువ వివాహాలు సంఘ్ నుంచే ఉంటాయి. మహిళలపై దాడులు దారుణం. మహిళలు భద్రంగా ఉండే వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్‌జీబీటీక్యూలు సమాజంలో భాగస్వాములే. వారిని వేరుగా చూడొద్దు. ఇంగ్లిష్ భాషకు సంఘ్ వ్యతిరేకం కాదు. ఈ భాషలో గొప్ప వ్యాఖ్యాతలు రావాలనేది మా అభిమతం. అయితే ఇది భారతీయ భాషగా మారొద్దనేనే మా సూచన. సరికొత్త విద్యావిధానం రావాల్సిన అవసరం ఉంది.
వీలైనంత త్వరగా రామమందిరం
Published Thu, Sep 20 2018 3:38 AM | Last Updated on Thu, Sep 20 2018 8:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment