సాక్షి, న్యూఢిల్లీ: ఎవరైనా నిమిషం పాటు శ్వాసను అదుపుచేయగలిగితే వారికి కరోనా లేనట్టేనని ప్రముఖ యోగ గురువు రామ్‌దేవ్ బాబా అన్నారు. శనివారం ఈ-ఎజెండా ఆజ్‌తక్ ప్రత్యేక సెషన్‌లో పాల్గొన్న రామ్‌దేవ్ కరోనా లక్షణాలు ఉన్నవారు కానీ, లేని వారు కానీ ఒక నిమిషం పాటు శ్వాసను ఆపగలిగితే వారికి కరోనా లేనట్టేనని తెలిపారు. కరోనా వైరస్‌కి ప్రత్యేకమైన ప్రాణాయామం ఉందని దానిని ఉజ్జయ్ అంటారన్నారు. ఈ ఉజ్జయ్ ప్రాణాయామంలో నోటిని మూసి ముక్కుద్వారా శ్వాస తీసుకొని దానిని కొంచెం సేపు ఉంచి నెమ్మదిగా విడుదల చేయాలని చెప్పారు. ఇలా చేయడం ద్వారా కరోనా ఉందో లేదో స్వయంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు 30 సెకన్ల పాటు శ్వాసను ఆపగలిగితే చాలని కరోనా లేదని నిర్థారించుకోవచ్చన్నారు. మిగిలిన వారు ఒక నిమిషం పాటు శ్వాసను కట్టడి చేయాలన్నారు. దీంతో పాటు ఆవ నూనెను ముక్కు రంధ్రంలో వేసుకోవడం ద్వారా అక్కడ కరోనా వైరస్ ఉంటే కడుపులోకి వెళ్లి ఉదరంలో ఉండే ఆమ్లాల కారణంగా చనిపోతుందన్నారు. (లాక్డౌన్ కారణంగా డిప్రెషన్కు లోనై ఆత్మహత్య)
ఇక శరీరంలో ఆక్సిజన్ తగ్గడం కూడా అనేక జబ్బులకు కారణమని రామ్‌దేవ్ బాబా అన్నారు. ఇది సైన్స్ ద్వారా కూడా నిరూపితమైందన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండే యోగ చేయాలని సూచించారు. యోగ చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అంతర్భాగాలన్ని శక్తిమంతమవుతాయని, దీని ద్వారా మనల్ని మనం కరోనా నుంచి రక్షించుకోగలమని రామ్‌దేవ్ తెలిపారు. ఇక భారతదేశంలో ఇప్పటి వరకు 24,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 775 మంది కరోనా బారిన పడి మరణించారు. (162 మంది జర్నలిస్టులకు కరోనా టెస్ట్...)
Comments
Please login to add a commentAdd a comment