ముస్తాబైన మసీదులు
నెలవంక కనిపించడంతో మంగళవారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదులు ముస్తాబయ్యాయి. ముస్లిం సోదరులకు రాష్ట్రంలోని పార్టీల నేతలు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
సాక్షి, చెన్నై: మహ్మద్ ప్రవక్త సూక్తుల మేరకు పుణ్యకార్యాలకు, సమతమమతలకు నెలవుగా రంజాన్ మాసం నిలుస్తోది. ఈ మాసంలో నరక ద్వారాలు మూసుకుని, స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయి. అందుకే పాప కర్మల నుంచి విముక్తి పొందడానికి ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో ఉపవాస దీక్షల్ని (రోజా) ఆచరిస్తుంటారు. శక్తి మేరకు సత్కార్యాలు, దాన ధర్మాలతో ప్రార్థనల్లో లీనమయ్యారు.
పేద, గొప్ప తేడా లేకుండా అల్లాకు విశ్వాస పాత్రులుగా ఉంటూ భక్తి భావంలో మునిగారు. నెలరోజులు కఠోర ఉపవాస దీక్షను ఆచరించిన ముస్లింలు అత్యంత పవిత్రమైన ఈద్ ముబార్ వేళకు సన్నద్ధమయ్యారు. సోమవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో మంగళవారం ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకునేందుకు రాష్ట్రంలోని ముస్లింలు సిద్ధమయ్యారు.
పండుగ సందడి: పవిత్ర రంజాన్ కోసం కొత్త దుస్తుల కొనుగోళ్లను ఇప్పటికే ముస్లింలు పూర్తి చేశారు. ఇక పండుగ రోజు ప్రత్యేక ప్రార్థనల కోసం టోపీలు, అత్తర్లు, బిర్యాని, తీపి పదార్థాల తయారీకి ఉపయోగించే వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం షాపింగ్ సెంటర్లకు తరలి వచ్చారు. దీంతో ముస్లింలు అత్యధికంగా ఉండే చెన్నైలోని ట్రిపిక్లేన్, మన్నడి, తండయార్ పేట, పూందమల్లి, అన్నానగర్, పురసైవాక్కం, పడప్పై, తాంబరం, అరుంబాక్కం, మణ్ణివాక్కం, అన్నా సాలై, ఎంఎండీఏ, ఆవడి, పూందమల్లి పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇక, మదురై, తిరునల్వేలి, కోయంబత్తూరు, రామనాధపురం, వేలూరు తదితర పట్టణాల్లో రంజాన్ ఉత్సాహం కనిపిస్తోంది.
నేడే సంబరం : నెల రోజులు దీక్షను ఆచరించడంతో పాటుగా రేయింబవళ్లు అల్లా ఆశీస్సుల కోసం ప్రార్థనల్లో నిమగ్నమైన ముస్లింలు పండుగ ప్రత్యేక ప్రార్థనకు రెడీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ఈద్గా మైదానాల్లో కొన్ని చోట్ల, మిగిలిన చోట్ల మసీదుల్లో ఈ ప్రార్థనలు జరగనున్నాయి. ఇందు కోసం మసీదులు ముస్తాబయ్యాయి. కొన్ని పెద్ద మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ పరిసరాల్లో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం ముస్లింలు అత్యధికంగా వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటుగా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.
నేతల శుభాకాంక్షలు: రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య తన ప్రకటనలో ముస్లింలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత తన ప్రకటనలో ముస్లింలందరూ సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహలతో జీవించాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్‌తో భక్తి భావం మరింతగా వికసించాలని పేర్కొంటూ ఈద్ ముబారక్ తెలియజేశారు. తమ ప్రభుత్వం ముస్లింలకు అందిస్తున్న సహకారాన్ని వివరించారు.
డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ప్రకటనలో మహ్మద్ ప్రవక్త అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన సూక్తులను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్న ముస్లింలలో స్నేహ భావం మరింత పెంపొందాలని కాంక్షించారు. అలాగే, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాసు, ఎండీఎంకే నేత వైగో, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్, తిరునావుక్కరసు, వీసీకే నేత తిరుమావళవన్, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా తదితరులు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.