‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’ | Ranu Mondal Daughter Says She Always Looked After Her | Sakshi
Sakshi News home page

ఆమె మొదటి భర్త కూతురిని; గర్వపడుతున్నా!

Published Tue, Sep 3 2019 12:20 PM | Last Updated on Mon, Nov 18 2019 11:59 AM

Ranu Mondal Daughter Says She Always Looked After Her - Sakshi

కోల్‌కతా : తమతో పాటు ఉండమని ఎన్నిసార్లు చెప్పినా తన తల్లి వినలేదని సోషల్‌ మీడియా సెన్సేషన్‌ రణు మొండాల్‌ కూతురు ఎలిజబెత్‌ సతీ రాయ్‌ అన్నారు. తన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోకుండా నెటిజన్లు తనను విమర్శించడం బాధ కలిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషనులో లతా మంగేష్కర్‌ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. రణు గాత్రానికి ముగ్ధుడైన బాలీవుడ్‌ సంగీత దర్శకుడు హిమేశ్‌ రేష్మియా ఆమెకు రెండు పాటలు పాడే అవకాశం కల్పించాడు. ఈ క్రమంలో తల్లిని అనాథలా వదిలేసిన రణు కూతురు..సెలబ్రిటీ హోదా దక్కిన తర్వాత తిరిగి తల్లి చెంతకు చేరిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయంపై స్పందించిన రణు కూతురు ఎలిజబెత్‌ సతీ రాయ్‌ మాట్లాడుతూ..‘ మా అమ్మ రైల్వే స్టేషనులో పాటలు పాడుతోందని నాకు తెలియదు. నేను ఆమె మొదటి భర్త కూతురిని. మేము ముంబైలో ఉండేవాళ్లం. నాకు ఓ అన్నయ్య ఉన్నాడు. మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్త ద్వారా తనకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అమ్మ ఇప్పుడు కోల్‌కతాలోనే ఉంటుంది. నేను కూడా ఇక్కడే ధర్మటాలలో ఉంటాను. నాకు ఉన్న బాధ్యతల కారణంగా నేను తరచుగా తనను కలిసే వీలు ఉండేది కాదు. నాకు నలుగురు పిల్లలు. భర్త వదిలేశాడు. చిన్న కూరగాయల షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. రెండు నెలల క్రితం బస్టాండులో తనను చూసినపుడు ఇంటికి నాతో పాటు ఇంటికి రమ్మని చెప్పాను. తను ఒప్పుకోలేదు. సరేనని 200 రూపాయలు చేతిలో పెట్టి ఇంటికి వెళ్లిపోయాను. అంతేకాదు నెలనెలా తనకు 5 వందల రూపాయలు పంపేదాన్ని. నా కొడుకు చాలా చిన్నవాడు. పిల్లలను చూసుకోవడంతో పాటు వ్యాపారం చేయడంతో నాకు కనీసం సరిగా తిండి తినే సమయం కూడా దొరకడం లేదు. ఇదంతా తెలియకుండా తల్లిని వదిలేశానంటూ జనాలు నన్ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటున్నారు. మిగతా వాళ్లైనా(సోదరులు) అమ్మను పట్టించుకోవచ్చు కదా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి : రైల్వే స్టేషన్‌లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!

అదే విధంగా రణు మొండాల్‌కు ఆశ్రయం కల్పించిన రణఘాట్‌ ఆమ్రా శోభై షోతాన్‌ క్లబ్‌ నిర్వాహకులపై ఎలిజబెత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ అతీంద్ర చక్రవర్తి, తపన్‌ దాస్‌(క్లబ్‌ సభ్యులు) నిజంగా మా అమ్మ సొంత కుమారులు అయి ఉంటే ఆమెను బాగా చూసుకునేవారు. కానీ మా అమ్మ వాళ్ల దగ్గర ఉన్నట్లు నాకు సమాచారం ఇవ్వలేదు. తన గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లాలని ప్రయత్నించగా నా కాళ్లు విరగ్గొట్టి బయటకు విసిరి వేస్తామని బెదిరించారు. నాకు వ్యతిరేకంగా మా అమ్మ మనసు మార్చారు. ఆమె దగ్గర నుంచి 10 వేల రూపాయలు తీసుకుని ఓ సూట్‌కేసు, రెండు నైటీలు మాత్రమే కొనిచ్చారు. వాళ్లను నమ్మడానికి వీల్లేదు అని విమర్శించారు. ఏదేమైనప్పటికీ అమ్మకు గుర్తింపు రావడం సంతోషంగా ఉందని... ఆమె కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement