న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) నోట్ల రద్దు సమయంలో రూ.500, రూ.2000ల నోట్లను తరలించటానికి ఏకంగా రూ. 29 కోట్లు ఖర్చు చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం డబ్బులు రవాణా చేయటానికి వీలుగా సైనిక విమానాలను ఉపయోగించటం వల్ల ఈ మొత్తం ఖర్చు అయినట్లు సమాచారం. నవంబర్ 8, 2016న 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు భారత ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో అత్యధిక భాగం సరఫరాలో ఉన్న డబ్బు చెల్లుబాటులో లేకుండా పోయింది. ఆర్‌బీఐ వీటి స్థానంలో కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిని దేశం మొత్తం సరఫరా చేయటానికి సీ-17, సీ-130 సూపర్ హెర్క్యులీస్ వంటి సైనిక విమానాలను ఉపయోగించింది.
దీంతో ఆ విమానాల నిర్వహణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ కొత్త 500, 2000 రూపాయల నోట్లు ముద్రించటానికి 2016-17 సంవత్సరానికి గానూ దాదాపు రూ. 7,965 కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం మిగిలిన చిల్లర మొత్తాలను ముద్రించటానికి రూ. 3,421కోట్లు ఖర్చు చేసింది. ఉపసంహరణకు గురైన పాత నోట్లు 99శాతం బ్యాంకులకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంకు తెలిపింది. కొత్త నోట్ల రవాణా కోసం సైనిక విమానాలను కాకుండా మామూలు విమానాలను ఉపయోగించి ఉంటే బాగుండేదని రిటైర్డ్ ఆర్మీ కమాండర్ లోకేష్ బట్రా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment