‘రియల్’ బిల్లుకు ఆమోదం
రాజ్యసభలో గట్టెక్కిన బిల్లు
♦ పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యం
♦ మోసానికి పాల్పడితే జైలు శిక్ష
♦ ట్రిబ్యునళ్ల ద్వారా 60 రోజుల్లో ఫిర్యాదుల పరిష్కారం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రియల్ ఎస్టేట్ బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ ‘స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు, 2015’ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సభలో ప్రవేశపెట్టారు. విపక్ష కాంగ్రెస్ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందింది. స్థిరాస్తిరంగ నియంత్రణ, పారదర్శకత, జవాబుదారీతనానికి ఉద్దేశించిన ఈ బిల్లులో వినియోగదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేసినట్లు వెంకయ్య తెలిపారు. బిల్లుపై
ఆయన తెలిపిన మరిన్ని వివరాలు..
♦ వినియోగదారుల డబ్బులో 70% చెక్కుల ద్వారా ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి కాబట్టి రియల్‌రంగంలోకి నల్లధనాన్ని ఈ బిల్లు నిరోధిస్తుంది.
♦ అన్ని అనుమతుల కోసం సింగిల్ విండో విధానం ఉంటుంది.
♦ రాష్ట్రాల స్థాయిలో నియంత్రణ సంస్థల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. తద్వారా గృహ, వాణిజ్య రంగ ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడొచ్చు.
♦ డెవలపర్లు తమ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివరాలను నియంత్రణ సంస్థలకు అందించాలి. ప్రమోటర్ల వివరాలు, భూ వివరాలు, ప్రాజెక్ట్ లేఔట్, అనుమతులు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, ఏజెంట్ల వివరాలు.. అందులో ఉండాలి.
♦ అప్పీలేట్ ట్రిబ్యునళ్లు ఫిర్యాదు అందిన 60 రోజుల్లోగా కేసులను పరిష్కరించాలి.
♦ ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రమోటర్లకు మూడేళ్లు, ‘రియల్’ఏజెంట్లు, కొనుగోలుదార్లకు ఏడాది జైలు శిక్ష ఉంటుంది.
♦ ఈ బిల్లు ఎవరినీ ఇబ్బందిపెట్టేందుకు ఉద్దేశించినది కాదు. బిల్డర్లపై వేధింపులు ఉండవు. ‘రియల్’ రంగాన్ని నియంత్రించేం దుకే దీన్ని రూపొందించాం. కొనుగోలుదారులను మోసంచేయడం నేరం. హెచ్చరికలు, జరిమానాల తరువాతే.. జైలుశిక్ష ఉంటుంది.
♦ పెట్టుబడిదారుల విశ్వాసం పొందడం ద్వారా ప్రభుత్వ పథకమైన ‘అందరికీ గృహ వసతి’ని విజయవంతం చేసేందుకు అవకాశం లభిస్తుంది.
♦ వ్యవసాయ రంగం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది స్థిరాస్తి రంగమే.
బిల్లుకు మద్దతు ప్రకటిస్తూ.. అన్ని గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఈ బిల్లు పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ సభ్యురాలు కుమారి షెల్జా కోరారు. ఈ బిల్లు ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి వినియోగదారుడికి ప్రయోజనం లభిస్తుందని బిల్లు ను అధ్యయనం చేసిన స్థాయీసంఘానికి నేతృత్వం వహించిన అనిల్ మాధవ్ దవే(బీజేపీ) తెలిపారు.
సామాజిక పథకాలకు కోత: కాంగ్రెస్
కేంద్ర బడ్జెట్‌లో సామాజిక పథకాలకు నిధులు తగ్గించారని, ఆహార, ఎరువుల రాయితీలకు కోతపెట్టారంటూ సర్కారుపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించి దేశంలో ప్రతీ ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న మోదీ హామీ ఎప్పుడు నెరవేరుతుందంటూ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. ఆ దిశగా మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని తప్పుబట్టారు.
2011 నుంచి 2016 వరకు..
జూలై 2011: రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణకు ఒక కేంద్ర చట్టం అవసరమని న్యాయశాఖ ప్రతిపాదన.
2013: జూన్‌లో రియల్ ఎస్టేట్ బిల్లు, 2013కు నాటి కేంద్ర కేబినెట్ ఆమోదం, ఆగస్ట్‌లో రాజ్యసభలో బిల్లు, సెప్టెంబర్‌లో స్థాయీ సంఘానికి నివేదన.
2015: ఫిబ్రవరిలో రాజ్యసభ, లోక్‌సభల్లో స్థాయీసంఘం నివేదిక, ఏప్రిల్‌లో స్థాయీసంఘం సిఫారసుల ఆధారంగా రూపొందించిన అధికారిక సవరణలకు కేబినెట్ ఆమోదం. మేలో రాజ్యసభ స్థాయీసంఘం ముందుకు ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2013’, అధికారిక సవరణలు. జూలైలో ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2015’తో పాటు తన నివేదికను సభకు సమర్పించిన స్థాయీసంఘం. డిసెంబర్లో ‘రియల్ ఎస్టేట్ బిల్లు 2015’కు కేబినెట్ ఆమోదం. రాజ్యసభలో బిల్లు.
2016: మార్చి 10న రాజ్యసభ ఆమోదం.