పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్, సీపీఐ సహా విపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ: పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సామాన్యుడి కష్టాల నుంచి లాభాలు గడించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తింది. శుక్రవారం రాత్రి నుంచి పెట్రోల్‌పై లీటరుకు రూ. 3.31, డీజిల్ ధరను లీటరుకు రూ. 2.71 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. కేవలం 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు భారీగా పెట్రో ధరలను పెంచటం సామాన్యులను, రైతులను దారుణంగా దెబ్బతీస్తోందని కాంగ్రెస్ పార్టీ సమాచార విభాగం ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా తప్పుపట్టారు.
పెట్రోలుపై లీటరుకు అదనంగా రూ. 19.49 చొప్పున, డీజిల్‌పై లీటరుకు అదనంగా రూ. 15.11 చొప్పున వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది నవంబర్‌లో పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని, కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి ధర పతనమవటం వల్ల పెట్రో ధరలు పెంచాల్సి వచ్చిందన్న ప్రభుత్వ వాదనలో నిజంలేదన్నారు. తాజా పెట్రో ధరల పెంపు ప్రజా వ్యతిరేకమని.. ఈ పెంపును తక్షణమే ఉపసంహరించాలని సీపీఐ డిమాండ్ చేసింది.