‘రీడ్‌ అండ్‌ టేలర్‌’  కన్నీటి కథ | Reid And Taylor India shuts Down | Sakshi
Sakshi News home page

‘రీడ్‌ అండ్‌ టేలర్‌’  కన్నీటి కథ

Published Wed, May 27 2020 10:14 AM | Last Updated on Wed, May 27 2020 12:22 PM

Reid And Taylor India shuts Down - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారికి సంబంధించిన వార్తల పరంపరలో భారత్‌లో చోటుచేసుకున్న మరో కీలక పరిణామం మరుగున పడి పోయింది. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేసిన, జేమ్స్‌ బాండ్‌ హీరో పియర్స్‌ బ్రాస్నన్‌ వాణిజ్య ప్రకటనలతో భారతీయులందరికి సుపరిచితమైన ‘రీడ్‌ అండ్‌ టేలర్‌’ బ్రాండ్‌ కంపెనీ మే 14వ తేదీన భారత్‌లో శాశ్వతంగా మూతపడింది. పర్యవసానంగా కంపెనీలో పనిచేస్తోన్న 1400 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. (లాక్డౌన్: తొలి ఐదు వారాలు చితక్కొట్టారు!)

స్కాట్‌లాండ్‌లో దాదాపు 190 ఏళ్ల చరిత్ర కలిగిన ‘రీడ్‌ అండ్‌ టేలర్‌’ వస్త్రాల కంపెనీకి భారత్‌లో 22 ఏళ్ల చరిత్ర ఉంది. మైసూర్‌ కేంద్రంగా 1998లో భారత్‌లో వెలిసిన ఈ కంపెనీని ‘రీడ్‌ అండ్‌ టేలర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఆర్‌ఎల్‌ఊఎల్‌)’గా మంచి గుర్తింపు పొందింది. మగవారి పాయింట్లు, చొక్కాలు, సూట్లు, జాకెట్లు, టై దుస్తులతో ధనిక,  మధ్యతరగతి భారతీయులను ఎంతోగానో ఈ బ్రాండ్‌ ఆకట్టుకుంది. దీన్ని భారత్‌లో స్థాపించిన మాతృ సంస్థ ఎస్‌ కుమార్స్‌గా పేరుపొందిన ఎస్‌ కుమార్స్‌ నేషన్‌వైడ్‌ లిమిటెడ్‌ (ఎస్‌కేఎన్‌ఎల్‌)’ కంపెని. (ఉప్పు.. పప్పు.. ల్యాప్‌టాప్‌!)


రీడ్‌ అండ్‌ టేలర్‌ పుట్టుపూర్వోత్తరాలు
స్కాట్‌లాండ్‌లో రకారకాల ఉన్నితో వస్త్రాలను తయారు చేసే అలెగ్జాండర్‌ రీడ్‌కు మంచి పేరుండేది. ఆయన తన వస్త్ర వ్యాపారాన్ని విస్తరించడం కోసం జోసఫ్‌ టేలర్‌ అనే బాగా డబ్బున్న ఫైనాన్సియర్‌ను పట్టుకొని ఇద్దరి పేర్లు స్ఫురించేలా ‘రీడ్‌ అండ్‌ టేలర్‌’ బ్రాండ్‌ పేరుతో బట్టల కంపెనీని ఏర్పాటు చేశారు. ఇదే కంపెనీ బ్రాండ్‌ భారతీయులకు పరిచయం చేయడం కోసం అప్పటికే భారత్‌లో గుర్తింపున్న ఎస్‌ కుమార్స్‌ 1997లో రీడ్‌ అండ్‌ టేలర్‌తో ఒప్పందం చేసుకున్నారు. కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా 1998లో ‘రీడ్‌ అండ్‌ టేలర్‌ ఇండియా లిమిటెడ్‌’ పేరిట కంపెనీనీ ఏర్పాటు చేశారు. (లాక్‌డౌన్‌ పొడిగిస్తే ఆర్థిక వినాశనమే...)

స్కాట్‌లాండ్‌లోని మాతృసంస్థ ‘రీడ్‌ అండ్‌ టేలర్‌’ తరహాలో మొదట జేమ్స్‌ బాండ్‌ హీరో యాడ్‌ను కొనసాగించిన ఎస్‌కేఎన్‌ఎల్, 2003లో బ్రాండ్‌ అంబాసిడర్‌గా అమితాబ్‌ను తీసుకొచ్చి వాణిజ్య ప్రకటనలను ఇప్పించడంతో బ్రాండ్‌ పేరు దేశమంతా తెల్సిపోయింది. అప్పటికే మార్కెట్లో అమితాబ్‌కు మంచి డిమాండ్‌ ఉండడంతో బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆయనకు బాగా రాయల్టీ చెల్లించాల్సి వచ్చింది. 2008 సంవత్సరంతో ‘రీడ్‌ అండ్‌ టేలర్‌’ కంపెనీని తన ఉప సంస్థగా ఎస్‌ కుమార్స్‌ ప్రకటించింది. అందులోని  25.4 శాతం వాటాను సింగపూర్‌లోని జీఐసీ కంపెనీకి 900 కోట్ల రూపాయలకు అమ్మేసింది. దాంతో ‘రీడ్‌ అండ్‌ టేలర్‌’ బ్రాండ్‌ విలువ 3,540 కోట్ల రూపాయలకు చేరుకోగా, మాత సంస్థ అయిన ఎస్‌ కుమార్‌ విలువ 2,240 కోట్ల రూపాయలుగా ఉండింది. 

2012 మార్చి నెలలో దాదాపు 470 కోట్ల రూపాయల లాభాన్ని ఎస్‌ కుమార్‌ చూపించింది. అప్పటి నుంచి ‘రీడ్‌ అండ్‌ టేలర్‌’కు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఆ కంపెనీ తరఫున వెయ్యి కోట్ల రూపాయల పబ్లిక్‌ ఫండింగ్‌ను సేకరించాలని 2011లోనే ఎస్‌ కుమార్స్‌ వ్యూహ రచన చేసింది. ఆ డబ్బుతో దేశవ్యాప్తంగా 15 ఫ్గాగ్‌షిప్‌ కార్యక్రమాలు నిర్వహించి 160 ప్రత్యేక షోరూమ్‌లను తెరవాలని ‘రీడ్‌ అండ్‌ టేలర్‌’ నిర్ణయించింది. ఆశించిన పబ్లిక్‌ ఫండ్‌కు ఆస్కారం లేకపోవడంతో కంపెనీ విస్తరణ కార్యక్రమాలకు స్వస్తి చెప్పింది. (42 మందికి కరోనా: నోకియా ప్లాంట్ మూత)

కంపెనీ నష్టాలవైపు నడుస్తున్న విషయాన్ని గమనించిన ఆర్థిక సంస్థలు 2012 సంవత్సరంలో ఆ కంపెనీలో తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. అదే సమయంలో ఐడీబీఐ బ్యాంక్‌ తన 14.57 శాతం వాటాను తీసేసుకొని అమ్మేసింది. 2013, మార్చి నెలనాటికి ‘రీడ్‌ అండ్‌ టేలర్‌ ఉప కంపెనీతో సహా ఎస్‌ కుమార్‌ కంపెనీ’ అప్పులు 4,484 కోట్ల రూపాయలుగా తేలింది. వాటిలో ఎక్కువ శాతం అప్పులు రీడ్‌ అండ్‌ టేలర్‌ కంపెనీ పేరుతోనే ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ సహా కంపెనీకి అప్పులిచ్చిన వారంతా కంపెనీకి వ్యతిరేకంగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఓ పక్క కోర్టు వ్యవహారాలు కొనసాగుతుండగానే 2018 సంవత్సరానికి కంపెనీ అప్పులు ఐదువేల కోట్ల రూపాయలు దాటి పోయాయి. చివరకు క్రెడిటర్లంతా ఓ కమిటీగా ఏర్పడి కంపెనీ ‘లిక్విడేషన్‌’కు ఆర్జి పెట్టుకున్నారు. 

ఆ సమయంలో కొత్త ప్రమోటర్‌ను వెతికి తీసుకరావడం ద్వారా  కంపెనీని రక్షించేందుకు 200 మంది సభ్యులు గల ‘రీడ్‌ అండ్‌ టేలర్‌ ఇండియా లిమిటెడ్‌ ఎంప్లాయీ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌’ తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. 2019, ఫిబ్రవరి నెలలో ‘నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌’ జోక్యం చేసుకొని ఆర్‌టీఐఎల్‌ ‘లిక్విడేషన్‌’కు ఆదేశించింది. ఆస్తులను అమ్మేసి వచ్చిన సొమ్మును క్రెడిటర్లకు పంచడాన్ని లిక్విడేషన్‌ అంటారు. ‘కంపెనీని రక్షించేందుకు గత 14 నెలలుగా నేను శత విధాల కషి చేశాను. లాభం లేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో లిక్విడేషన్‌ చేయక తప్పలేదు’ అని లిక్విడేటర్‌గా వ్యవహరించిన రవి శంకర్‌ దేవరకొండ మీడియాకు తెలియజేశారు. వాణిజ్య ప్రకటనలకు, సెలబ్రిటీలకు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల కంపెనీ దివాలా తీసిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement