గులాబో సితాబో పోస్టర్
అందరూ ఊహిస్తున్నదే మొదలవుతున్నట్టుంది. రిలీజ్‌కు సిద్ధంగా ఉండి లాక్‌డౌన్ వల్ల థియేటర్లలో ఇప్పుడప్పుడే ప్రదర్శనకు నోచుకునే వీలు లేని సినిమాలన్నీ తమ విడుదలకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నాయి. బాలీవుడ్‌లో ఈ ఒరవడికి ‘గులాబో సితాబో’ తెర తీయనుంది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ సినిమా ప్రసిద్ధ దర్శకుడు సూజిత్ సర్కార్ చేతుల్లో రూపుదిద్దుకుంది. గతంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఇది ఏప్రిల్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ వల్ల, కరోనా అనిశ్చితి వల్ల పూర్వ స్థితి ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేనందున డిజిటల్ రిలీజ్‌కు దర్శకుడు సూజిత్ రంగం సిద్ధం చేశాడు.
ఓటీటీ దిగ్గజం అమేజాన్ ప్రైమ్‌లో జూన్ 12వ తేదీన ‘గులాబో సితాబో’ విడుదల కానుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ఒక ముస్లిం ఇంటి యజమానిగా, ఆయుష్మాన్ ఖురానా అతని దగ్గర హిందూ కిరాయిదారుగా నటించారు. ‘‘సరిహద్దులను చెరిపేసే సరదా కథ ఇది’’ అని అమితాబ్ చెప్పారు. ‘‘సినిమాలో నేను, ఆయుష్మాన్ ఖురానా అనుక్షణం పేచీ పడుతుంటాం. కానీ వాస్తవానికి షూటింగ్‌లో ఇద్దరం ఎంతో అవగాహనతో పని చేశాం’’ అని కూడా ఆయన అన్నారు. ‘‘అమితాబ్‌తో నటించాలనే నా రహస్య కోరికను సూజిత్ తీర్చినందుకు కృతజ్ఞతలు’’ అని ఆయుష్మాన్ ఖురానా చెప్పారు. కామెడీ ప్లస్ డ్రామా కలిసిన ఈ సినిమాను డ్రామెడీ అంటున్నారు. దీని కోసం జూన్ 12 వరకు వేచి చూడక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment