జన ఘన వేడుకలు!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం జరిగిన 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. పండుగను తలపించే వేడుక నడుమ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చారిత్రక ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సైనిక దళాల వందనం స్వీకరించారు. రైసినా హిల్స్ నుంచి ఎర్రకోట వరకు నిర్వహించిన కవాతు భారత రక్షణ పాటవాన్ని, భిన్నత్వంలో ఏకతను ప్రతిబింబించింది. సైనిక విన్యాసాలను తిలకించేందుకు వణికించే చలిలోనూ పౌరులు బారులు తీరారు. జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సైనికాధికారులు, దౌత్యాధికారులు హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు. కవాతు ప్రారంభానికి ముందు ఇండియా గేట్ వద్ద ‘అమర్ జవాన్ జ్యోతి’కి ప్రధాని, రక్షణమంత్రి ఆంటోనీ నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కవాతు సాగే మార్గంలో ఎన్‌ఎస్‌జీ కమాండోలను మోహరించారు. నగరంలో 25 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని విధుల్లో నియమించారు. రాజ్‌పథ్ వద్ద సైనిక కవాతును తిలకించిన వారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. గణతంత్ర దినోత్సవం రోజే మయన్మార్ సరిహద్దులో అస్సాం రైఫిల్స్ పోస్టుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిలో మేజర్ ర్యాంక్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఉగ్రవాదులు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో వేర్వేరు చోట్ల నాలుగు బాంబులు పేల్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఘన వేడుకలు జరిగాయిలా..
తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బహుముఖ పాత్ర పోషించే లక్ష్యంతో ఈ నాలుగో తరానికి చెందిన అతిధ్వానిక యుద్ధవిమానాన్ని డీఆర్‌డీవో తయారు చేసింది.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, అభివృద్ధి చేసిన ప్రధాన యుద్ధట్యాంక్ ‘అర్జున్ ఏంకే- ఐఐ’కూడా ప్రదర్శనలో పాల్గొంది.
రవాణా విమానం ‘సీ-130 జే సూపర్ హెర్క్యులస్’ సుదూర సామర్థ్యం కలిగిన ‘సీ-17 గ్లోబ్‌మాస్టర్’ కూడా పాల్గొన్నాయి.
పారాచూట్ రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్, మద్రాస్ రెజిమెంట్, మెహర్ రెజిమెంట్, జమ్ము కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్, 9 గూర్ఖా రైఫిల్స్, బీఎస్‌ఎస్, సీఆర్‌పీఎఫ్ తదితర సిబ్బంది గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి వచ్చిన ముఖ్య అతిథి, జపాన్ ప్రధాని షింజో అబెను ప్రధాని మన్మోహన్ సాదరంగా గణతంత్ర వేడుకలకు ఆహ్వానించారు.
మన్మోహన్ ‘ప్రియమిత్రుడు’: అబే
న్యూఢిల్లీ: మన్మోహన్ సింగ్ తన ‘ప్రియమిత్రుడు’ అని, తన గురువుల్లో ఒకరని జపాన్ ప్రధాని అబే అన్నారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అబే గౌరవార్థం ప్రధాని ఆదివారం రాత్రి తన అధికారిక నివాసంలో ప్రైవేటు విందు ఏర్పాటు చేశారు. అబే, ఆయన భార్య అకిలు విందులో పాల్గొన్నారు. ఘన విజయాలు సాధించిన మన్మోహన్‌కు అభినందించేందుకు ఇక్కడకు వచ్చానని అబే చెప్పారు.