indian capital
-
విషతుల్య రాజధాని
భారత రాజధాని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి శీతకాలంలానే ఈ ఏడాదీ పాత కథ పునరావృత్తం అయింది. ఒకపక్క పెరిగిన చలికి తోడు ధూళి నిండిన పొగ లాంటి గాలి, కాలుష్య ఉద్గారాలు, పొరుగున ఉన్న పంజాబ్ – హర్యానా లాంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో అక్రమంగా సాగుతున్న కొయ్యకాళ్ళ దహనం... అన్నీ కలిసి అతి తీవ్ర వాయు కాలుష్యంగా పరిణమించాయి. వారంగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం, వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) సోమవారం గరిష్ఠంగా దాదాపు 500 మార్కును చేరడంతో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్కూల్ పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు బాకూలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సైతం ఈ కాలుష్యాన్ని ఆందోళనకరంగా పరిగణించడం, నిపుణులు దీన్ని ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు తార్కాణం. ఢిల్లీలో సోమవారంæ కాలుష్య స్థాయి దీపావళి నాటి రాత్రి కన్నా దాదాపు 40 శాతం ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి... భారతీయ ప్రమాణాల కన్నా 14 రెట్లు ఎక్కువ, అదే ఐరాస పర్యావరణ పరిరక్షక సంస్థ (యూఎస్‌ఈపీఏ) నిర్దేశించిన ప్రమాణాల లెక్కలో అయితే 55 రెట్లు ఎక్కువ నమోదైంది. వాయు నాణ్యత ఇంతలా క్షీణించడం పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రమాదంగా పరిణమిస్తోంది. పీఎం 10 స్థాయిని బట్టి అంచనా వేసే ధూళి కాలుష్యమూ హెచ్చింది. ఆగ్రాలో కళ్ళు పొడుచుకున్నా కనిపించని దట్టమైన పొగ. తాజ్‌మహల్ కట్టడం విషవాయు కౌగిలిలో చేరి, దూరం నుంచి చూపరులకు కనిపించడం మానేసి వారమవుతోంది. మాస్కులు లేకుండా వీధుల్లోకి రాలేని పరిస్థితి. వెరసి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమనే దుష్కీర్తి ఢిల్లీకి దక్కింది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ తేల్చిన ఈ నిష్ఠురసత్యం ఇన్నేళ్ళ మన బాధ్యతా రాహిత్యానికీ, పాలకుల నిష్క్రియాపరత్వానికీ నిదర్శనం. ఆ మాటకొస్తే, 2018లో కానీ, గడచిన 2023లో కానీ ఏడాదిలో ఏ ఒక్కరోజూ ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లేదని రికార్డులు చెబుతున్నాయంటే ఏమనాలి? కాలుష్యం దేశవ్యాప్తంగా ఉందనీ, నివారణ బాధ్యత రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా అని ఢిల్లీ ‘ఆప్’ సర్కార్ వాదన. కానీ, ఏటేటా శీతకాలంలో రాజధానిలో పెరుగుతూ పోతున్న ఈ కష్టానికి చెక్ పెట్టడంలో పాలకులు ఎందుకు విఫలమయ్యారంటే జవాబు దొరకదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ సర్కార్ కాలుష్య నిరోధానికి యంత్రాల ద్వారా నీటి తుంపర్లు జల్లడం లాంటి చర్యలు చేపడుతోంది. ఇవేవీ చాలక చివరకు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లలో కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మేఘమథనం జరిపేందుకు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని అనుమతి కోరినా, జవాబు లేదన్నది ‘ఆప్’ ఆరోపణ. ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రయోజనమెంత అనేది చర్చనీయాంశమే. అయితే, ప్రజలకు తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే ఇలాంటి ప్రయత్నాలకు కేంద్రం మొదటే మోకాలడ్డడం సరికాదు. వాయు కాలుష్యం ‘అతి తీవ్ర’ స్థాయులకు చేరిన నేపథ్యంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్) నాలుగోదశ చర్యలను కఠినంగా అమలు చేయాలన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. పాఠశాలల్ని మూసివేయడం, ఆఫీసుకు రాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేయడం, పరిశ్రమల మూసివేత లాంటి చర్యలన్నీ నాలుగో దశ కిందకు వస్తాయి. ముప్పు ముంచుకొస్తున్నా మూడో దశ, నాలుగో దశ చర్యల్లో అధికారులు ఆలస్యం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు షరతులు అమలు చేయాల్సిందేనని కోర్ట్ చెప్పాల్సి వచ్చిందంటే అధికార యంత్రాంగం అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నిద్ర లేచిన ప్రభుత్వం ఇప్పుడిక ‘గాప్’ నాలుగో దశ కింద వాహనాల రాకపోకలు, భవన నిర్మాణ కార్యకలాపాలపై షరతులు విధించింది. అయితే, దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో దాదాపు 34 లక్షల చిన్న, మధ్యశ్రేణి సంస్థల్లో ఉత్పత్తి దెబ్బతిననుంది. అంటే కాలుష్య పాపం ఆరోగ్యాన్నే కాక ఆర్థికంగానూ కుంగదీస్తుందన్న మాట. ఢిల్లీలో వాహనాల వల్ల అత్యధిక కాలుష్యం సంభవిస్తుంటే, ఎన్సీఆర్లో పరిశ్రమలు ప్రధాన కాలుష్య కారకాలని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి) 2021లోనే తేల్చింది. అనేకచోట్ల ఇప్పటికీ కట్టెల వాడకం కొనసాగుతోంది. ఇక, పొలాల్లో కొయ్య కాళ్ళ దహనం తాజా దురవస్థకు 40 శాతం కారణమట. అన్నీ కలిసి పీల్చే గాలే విషమయ్యేసరికి, ఢిల్లీ వాసుల ఆయుఃప్రమాణం సగటున ఏడేళ్ళు తగ్గుతోంది. రాజధాని, ఆ పరిసరాల్లోని 3 కోట్ల పైచిలుకు మంది వ్యధ ఇది. నిజానికి, స్వచ్ఛమైన గాలి ప్రాథమిక మానవహక్కని గత నెలతో సహా గత అయిదేళ్ళలో సుప్రీమ్ అనేకసార్లు స్పష్టం చేసింది. వాయునాణ్యతకు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర, రాష్ట్రస్థాయి యంత్రాంగాలను ఆదేశించింది. అయినా జరిగింది తక్కువ. సరైన ప్రాణ వాయువు కూడా అందని ఈ పరిస్థితికి ప్రజల నుంచి పాలకుల దాకా అందరూ బాధ్యులే. కాలుష్య నివారణ, నియంత్రణలకు సృజనాత్మక ఆలోచనలు చేయలేకపోవడం ఘోరం. దాహమేసినప్పుడు బావి తవ్వకుండా ఏడాది పొడుగూతా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టడం అవసరం. ఆధునిక సాంకేతికత, ప్రజారవాణా, ప్రజల అలవాట్లలో మార్పులు సహా అనేక అంశాల్లో రాజకీయ కృత నిశ్చయంతో విధాన నిర్ణేతలు పనిచేయాలి. లేదంటే, సాక్షాత్తూ దేశ రాజధానే నివాసయోగ్యం కాక జనం తరలిపోతుండడం చూసి వికసిత భారత్, లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ లాంటివన్నీ వట్టి గాలి మాటలే అనుకోవాల్సి వస్తుంది. -
జన ఘన వేడుకలు!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం జరిగిన 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. పండుగను తలపించే వేడుక నడుమ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చారిత్రక ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సైనిక దళాల వందనం స్వీకరించారు. రైసినా హిల్స్ నుంచి ఎర్రకోట వరకు నిర్వహించిన కవాతు భారత రక్షణ పాటవాన్ని, భిన్నత్వంలో ఏకతను ప్రతిబింబించింది. సైనిక విన్యాసాలను తిలకించేందుకు వణికించే చలిలోనూ పౌరులు బారులు తీరారు. జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సైనికాధికారులు, దౌత్యాధికారులు హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు. కవాతు ప్రారంభానికి ముందు ఇండియా గేట్ వద్ద ‘అమర్ జవాన్ జ్యోతి’కి ప్రధాని, రక్షణమంత్రి ఆంటోనీ నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కవాతు సాగే మార్గంలో ఎన్ఎస్జీ కమాండోలను మోహరించారు. నగరంలో 25 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని విధుల్లో నియమించారు. రాజ్‌పథ్ వద్ద సైనిక కవాతును తిలకించిన వారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. గణతంత్ర దినోత్సవం రోజే మయన్మార్ సరిహద్దులో అస్సాం రైఫిల్స్ పోస్టుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిలో మేజర్ ర్యాంక్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఉగ్రవాదులు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో వేర్వేరు చోట్ల నాలుగు బాంబులు పేల్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఘన వేడుకలు జరిగాయిలా.. తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బహుముఖ పాత్ర పోషించే లక్ష్యంతో ఈ నాలుగో తరానికి చెందిన అతిధ్వానిక యుద్ధవిమానాన్ని డీఆర్డీవో తయారు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, అభివృద్ధి చేసిన ప్రధాన యుద్ధట్యాంక్ ‘అర్జున్ ఏంకే- ఐఐ’కూడా ప్రదర్శనలో పాల్గొంది. రవాణా విమానం ‘సీ-130 జే సూపర్ హెర్క్యులస్’ సుదూర సామర్థ్యం కలిగిన ‘సీ-17 గ్లోబ్‌మాస్టర్’ కూడా పాల్గొన్నాయి. పారాచూట్ రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్, మద్రాస్ రెజిమెంట్, మెహర్ రెజిమెంట్, జమ్ము కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్, 9 గూర్ఖా రైఫిల్స్, బీఎస్ఎస్, సీఆర్పీఎఫ్ తదితర సిబ్బంది గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి వచ్చిన ముఖ్య అతిథి, జపాన్ ప్రధాని షింజో అబెను ప్రధాని మన్మోహన్ సాదరంగా గణతంత్ర వేడుకలకు ఆహ్వానించారు. మన్మోహన్ ‘ప్రియమిత్రుడు’: అబే న్యూఢిల్లీ: మన్మోహన్ సింగ్ తన ‘ప్రియమిత్రుడు’ అని, తన గురువుల్లో ఒకరని జపాన్ ప్రధాని అబే అన్నారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అబే గౌరవార్థం ప్రధాని ఆదివారం రాత్రి తన అధికారిక నివాసంలో ప్రైవేటు విందు ఏర్పాటు చేశారు. అబే, ఆయన భార్య అకిలు విందులో పాల్గొన్నారు. ఘన విజయాలు సాధించిన మన్మోహన్‌కు అభినందించేందుకు ఇక్కడకు వచ్చానని అబే చెప్పారు. -
ఆహా అన్పించిన ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీవాసులు ఎంతటి చైతన్యవంతులో చెప్పేందుకు ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఆదివారం వెలువడిన తీర్పే నిదర్శనం. రాజధాని నగరమైన ఢిల్లీ మినీ భారత్‌ను తలపిస్తుంటుంది. కోటీశ్వరులతో పాటు, పొట్ట నింపుకోవడానికి కోటి కష్టాలు పడే పేదలున్న బస్తీలు కూడా ఇక్కడ అపారం. అన్నింటికి మించి భారత దేశంలోని వివిధ రాష్ట్రాల, ప్రాంతాలవారు ఇక్కడ స్థిరపడిన వారిలో ఉంటారు. ఇలా చూస్తే ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఆయా రాష్ట్రాల, ప్రాంతాల, కులాల సమీకరణాలు పని చేస్తుంటాయి. అయితే వీటన్నింటిని పక్కకు నెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు అన్ని వర్గాలూ బాసటగా నిలిచాయి. 28 స్థానాల్లో ఆప్ గెలవగా, పదిహేనేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కరిష్మా తోడై బీజేపీ 32 స్థానాలు సాధించడం తెలిసిందే. ఢిల్లీ ఓటరు తీర్పును ప్రాంతాలవారీగా ఢిల్లీని సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, నార్త్‌వెస్ట్ ఢిల్లీ, నార్త్ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్‌ఢిల్లీ, సౌత్‌వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీగా విభజించి పరిశీలించవచ్చు. సెంట్రల్ ఢిల్లీ: 4 సీట్లలో ఆప్‌కు 3 సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ ప్రాంతంలో బల్లిమరన్, కరోల్‌బాగ్, న్యూఢిల్లీ, జంగ్‌పురా... ఇలా 4 అసెంబ్లీ స్థానాలుంటాయి. వీటిలో ఎక్కువ మంది ఓటర్లు కేంద్ర ప్రభుత్వోద్యోగులు, మురికివాడల ప్రజలే. వీటిలో న్యూఢిల్లీ సహా మూడింటిని ఆప్ చేజిక్కించుకుంది. బల్లిమరన్ను మాత్రం కాంగ్రెస్ కనాకష్టంగా నిలబెట్టుకుంది. ఉద్యోగులతోపాటు పేదలు, దిగువ మధ్యతరగతి వారు తిరుగులేని మెజారిటీతో ఆప్‌కు పట్టం కట్టారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా ఉన్న ఇక్కడి జుగ్గీజోపిడీల ఓటర్లు సైతం కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్త్‌వెస్ట్, నార్త్ ఢిల్లీ...: 20 సీట్లలో ఆప్‌కు 7: ఈ ప్రాంతాల్లోని 20 స్థానాల్లో కొన్ని శివారు ప్రాంతాలు. వాటిలో చాలామంది ఓటర్లు కేజ్రీవాల్ స్వరాష్ట్రమైన హర్యానా వారే. దాంతో ఎక్కువ మంది ఆప్ వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానాల్లో ఈసారి బీజేపీ, ఆప్ చెరో 7 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ మూడింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెస్ట్ ఢిల్లీ, సౌత్‌వెస్ట్ ఢిల్లీ: 21 సీట్లలో ఆప్‌కు 9 21 స్థానాలున్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది! ఇక్కడ ఎక్కువగా పంజాబీలు, హర్యానాలతో పాటు దక్షిణాది ఓటర్లుంటారు. వీరంతా ఈసారి కాంగ్రెస్‌కు పూర్తి వ్యతిరేక ఫలితాలిచ్చారు. ఇక్కడ ఆప్ 9 స్థానాలు గెలిచింది. దళితులు,పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతాల ఓటర్లంతా ఆప్‌వైపు మళ్లడం గమనార్హం. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో సిక్కులంతా బీజేపీకే మద్దతిచ్చారు. బీజేపీకి 11, దాని మిత్రపక్షం అకాలీదళ్‌కు 1 వచ్చాయి. సౌత్ ఢిల్లీలో...: 10 సీట్లలో ఆప్‌కు 5 ఇక్కడి 10 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా తమిళ, మలయాళీ, తెలుగు తదితర దక్షిణాది ఓటర్లతో పాటు ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ. వీరిలో చాలామంది ఆప్కే ఓటేశారు. కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ ఆప్ పట్టు నిలుపుకుంది. మురికి వాడల్లోని లక్షలాది ఓట్లు గుండుగుత్తగా దాని ఖాతాలోకి వెళ్లాయి. ఆప్‌కు 5, మధ్యతరగతి ఓటర్లున్న ప్రాంతాల్లో బీజేపీకి 4 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ మాత్రం ముస్లిం ఓటర్లు కాస్త ఎక్కువగా ఉన్న ఆసిఫ్‌నగర్‌తో సరిపెట్టుకుంది. ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో...: 15 సీట్లలో ఆప్‌కు 4 ఈస్ట్ ఢిల్లీవాసుల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్‌తో పాటు పర్వత ప్రాంతీయులు. వీరిలో ఢిల్లీ ఓటర్లలో కీలకంగా భావించే పూర్వాంచలీయులు ఉండే ప్రాంతాలు కూడా ఎక్కువే. ఈ ప్రాంతంలో 15 స్థానాల్లో బీజేపీ ఎనిమిది కైవసం చేసుకుంది. అనధికారిక కాలనీలు, బెంగాలీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆప్ 4 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా భావించే అనధికారిక కాలనీల్లో, మురికి వాడల్లో ఆప్‌కు భారీ మద్దతు లభించడం విశేషం.