ఆహా అన్పించిన ఆప్ | aam admi party 's great victory in delhi | Sakshi
Sakshi News home page

ఆహా అన్పించిన ఆప్

Published Tue, Dec 10 2013 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

aam admi party 's great victory in delhi

 సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీవాసులు ఎంతటి చైతన్యవంతులో చెప్పేందుకు ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఆదివారం వెలువడిన తీర్పే నిదర్శనం. రాజధాని నగరమైన ఢిల్లీ మినీ భారత్‌ను తలపిస్తుంటుంది. కోటీశ్వరులతో పాటు, పొట్ట నింపుకోవడానికి కోటి కష్టాలు పడే పేదలున్న బస్తీలు కూడా ఇక్కడ అపారం. అన్నింటికి మించి భారత దేశంలోని వివిధ రాష్ట్రాల, ప్రాంతాలవారు ఇక్కడ స్థిరపడిన వారిలో ఉంటారు. ఇలా చూస్తే ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఆయా రాష్ట్రాల, ప్రాంతాల, కులాల సమీకరణాలు పని చేస్తుంటాయి. అయితే వీటన్నింటిని పక్కకు నెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు అన్ని వర్గాలూ బాసటగా నిలిచాయి. 28 స్థానాల్లో ఆప్ గెలవగా, పదిహేనేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కరిష్మా తోడై బీజేపీ 32 స్థానాలు సాధించడం తెలిసిందే. ఢిల్లీ ఓటరు తీర్పును ప్రాంతాలవారీగా ఢిల్లీని సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, నార్త్‌వెస్ట్ ఢిల్లీ, నార్త్‌ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్‌ఢిల్లీ, సౌత్‌వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీగా విభజించి పరిశీలించవచ్చు.
 
 సెంట్రల్ ఢిల్లీ: 4 సీట్లలో ఆప్‌కు 3
 సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ ప్రాంతంలో బల్లిమరన్, కరోల్‌బాగ్, న్యూఢిల్లీ, జంగ్‌పురా... ఇలా 4 అసెంబ్లీ స్థానాలుంటాయి. వీటిలో ఎక్కువ మంది ఓటర్లు కేంద్ర ప్రభుత్వోద్యోగులు, మురికివాడల ప్రజలే. వీటిలో న్యూఢిల్లీ సహా మూడింటిని ఆప్ చేజిక్కించుకుంది. బల్లిమరన్‌ను మాత్రం కాంగ్రెస్ కనాకష్టంగా నిలబెట్టుకుంది. ఉద్యోగులతోపాటు పేదలు, దిగువ మధ్యతరగతి వారు తిరుగులేని మెజారిటీతో ఆప్‌కు పట్టం కట్టారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా ఉన్న ఇక్కడి జుగ్గీజోపిడీల ఓటర్లు సైతం కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 నార్త్‌వెస్ట్, నార్త్ ఢిల్లీ...: 20 సీట్లలో ఆప్‌కు 7: ఈ ప్రాంతాల్లోని 20 స్థానాల్లో కొన్ని శివారు ప్రాంతాలు. వాటిలో చాలామంది ఓటర్లు కేజ్రీవాల్ స్వరాష్ట్రమైన హర్యానా వారే. దాంతో ఎక్కువ మంది ఆప్ వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానాల్లో ఈసారి బీజేపీ, ఆప్ చెరో 7 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ మూడింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 
 వెస్ట్ ఢిల్లీ, సౌత్‌వెస్ట్ ఢిల్లీ: 21 సీట్లలో ఆప్‌కు 9
 21 స్థానాలున్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది! ఇక్కడ ఎక్కువగా పంజాబీలు, హర్యానాలతో పాటు దక్షిణాది ఓటర్లుంటారు. వీరంతా ఈసారి కాంగ్రెస్‌కు పూర్తి వ్యతిరేక ఫలితాలిచ్చారు. ఇక్కడ ఆప్ 9 స్థానాలు గెలిచింది. దళితులు,పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతాల ఓటర్లంతా ఆప్‌వైపు మళ్లడం గమనార్హం. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో సిక్కులంతా బీజేపీకే మద్దతిచ్చారు. బీజేపీకి 11, దాని మిత్రపక్షం అకాలీదళ్‌కు 1 వచ్చాయి.
 
 సౌత్ ఢిల్లీలో...: 10 సీట్లలో ఆప్‌కు 5
 ఇక్కడి 10 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా తమిళ, మలయాళీ, తెలుగు తదితర దక్షిణాది ఓటర్లతో పాటు ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ. వీరిలో చాలామంది ఆప్‌కే ఓటేశారు. కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ ఆప్ పట్టు నిలుపుకుంది. మురికి వాడల్లోని లక్షలాది ఓట్లు గుండుగుత్తగా దాని ఖాతాలోకి వెళ్లాయి. ఆప్‌కు 5, మధ్యతరగతి ఓటర్లున్న ప్రాంతాల్లో బీజేపీకి 4 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ మాత్రం ముస్లిం ఓటర్లు కాస్త ఎక్కువగా ఉన్న ఆసిఫ్‌నగర్‌తో సరిపెట్టుకుంది.
 
 ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో...: 15 సీట్లలో ఆప్‌కు 4
 ఈస్ట్ ఢిల్లీవాసుల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్‌తో పాటు పర్వత ప్రాంతీయులు. వీరిలో ఢిల్లీ ఓటర్లలో కీలకంగా భావించే పూర్వాంచలీయులు ఉండే ప్రాంతాలు కూడా ఎక్కువే. ఈ ప్రాంతంలో 15 స్థానాల్లో బీజేపీ ఎనిమిది కైవసం చేసుకుంది. అనధికారిక కాలనీలు, బెంగాలీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆప్ 4 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా భావించే అనధికారిక కాలనీల్లో, మురికి వాడల్లో ఆప్‌కు భారీ మద్దతు లభించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement