
న్యూఢిల్లీ: బీజేపీ, ఆప్ చేపట్టిన పోటీపోటీ నిరసనలతో శుక్రవారం సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. రెండు పార్టీల శ్రేణులు నేరుగా తలపడే పరిస్థితిని నివారించేందుకు పోలీసులు పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. దేశ రాజధాని వ్యాప్తంగా పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. పండిట్ దీన్ దయాళ్ మార్గ్(డీడీయూ)వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు.
భారీ ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా నిరసన తెలపాలని నిర్ణయించింది.
అదేసమయంలో, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని కాషాయ పార్టీ తీర్మానించుకుంది. ఆ మేరకు రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు బయలుదేరగా పోలీసులు వారిని 800 మీటర్ల దూరంలో ఆపేశారు. రోడ్డుపై పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించి పరస్పరం తలపడే పరిస్థితిని నివారించారు. రెండు పార్టీల నాయకులు అక్కడే ధర్నా చేపట్టారు.
ఈడీ సమన్లకు అయిదోసారీ డుమ్మా
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించేందుకు ఈడీ బుధవారం ఐదోసారి పంపిన సమన్లనూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పట్టించుకోలేదు. శుక్రవారం విచారణకు డుమ్మా కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment