central delhi
-
ఢిల్లీలో ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
న్యూఢిల్లీ: బీజేపీ, ఆప్ చేపట్టిన పోటీపోటీ నిరసనలతో శుక్రవారం సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. రెండు పార్టీల శ్రేణులు నేరుగా తలపడే పరిస్థితిని నివారించేందుకు పోలీసులు పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. దేశ రాజధాని వ్యాప్తంగా పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. పండిట్ దీన్ దయాళ్ మార్గ్(డీడీయూ)వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. భారీ ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా నిరసన తెలపాలని నిర్ణయించింది. అదేసమయంలో, ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని కాషాయ పార్టీ తీర్మానించుకుంది. ఆ మేరకు రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు బయలుదేరగా పోలీసులు వారిని 800 మీటర్ల దూరంలో ఆపేశారు. రోడ్డుపై పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించి పరస్పరం తలపడే పరిస్థితిని నివారించారు. రెండు పార్టీల నాయకులు అక్కడే ధర్నా చేపట్టారు. ఈడీ సమన్లకు అయిదోసారీ డుమ్మా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నించేందుకు ఈడీ బుధవారం ఐదోసారి పంపిన సమన్లనూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పట్టించుకోలేదు. శుక్రవారం విచారణకు డుమ్మా కొట్టారు. -
సెంట్రల్ ఢిల్లీలో డ్రోన్ కలకలం
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్రం జరుగుతున్న సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఓ డ్రోన్ ఎగరడంతో పోలీస్ అధికారులను చెమటలు పట్టించింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బర్త్‌డే పార్టీని షూట్ చేసేందుకు వాడిన డ్రోన్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని సంబంధీకుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జీ20 సదస్సు నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తగా ఆగస్ట్ 29 నుంచి ఈ నెల 12 వరకు పలు భద్రతా చర్యలు ప్రకటించారు. పారా గ్లైడర్లు, బెలూన్లు, డ్రోన్ల వంటివి ఎగరేయడంపై నిషేధం కూడా అందులో ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా సెంట్రల్ ఢిల్లీలోని షాది ఖాంపూర్‌కు చెందిన హర్మన్‌జీత్ సింగ్(29) బంధువు పుట్టిన రోజు వేడుకను తన నివాసం టెర్రస్‌పై ఏర్పాటు చేశాడు. దీనిని షూట్ చేసేందుకు డ్రోన్‌ను వాడాడు. జీ20 శిఖరాగ్రం జరుగుతున్న ప్రాంతంలో ఇది ఆకాశంలో ఎగురుతుండటం గమనించిన కంట్రోల్ స్టేషన్ అధికారులు, అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. వారు వెంటనే డ్రోన్‌ను వినియోగిస్తున్న హర్మన్‌జీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్లోని ఫుటేజీని పరిశీలించడగా అది బర్త్‌డే పార్టీకి సంబంధించిందేనని తేలింది. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పండిట్ దీన్‌దయాళ్ భవన్‌లోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న 24 ఫైరింజన్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డుకు గాయలైనట్టుగా సమాచారం. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ క్లాంపెక్స్‌లో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్రాంచ్‌తోపాటు, అటవీ మంత్రిత్వ శాఖ, ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయాలు ఈ సముదాయంలోనే ఉండటంతో ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో ఈ బిల్డింగ్‌ను పర్యావరణ భవన్‌గా పలిచేవారు. -
ఉమర్ ఖలీద్‌పై కాల్పులు..!
సాక్షి, న్యూఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై సోమవారం దేశ రాజధానిలో కాల్పులు జరిగాయి. హై సెక్యూరిటీ ఉండే సెంట్రల్ ఢిల్లీలో సోమవారం పట్టపగలు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల నుంచి ఉమర్ ఖలీద్ సురక్షితంగా తప్పించుకున్నారు. సెంట్రల్ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమర్ ఖలీద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్యంగా ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులతో అప్రమత్తమైన ఖలీద్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ‘ఓ కార్యక్రమం కోసం మేం వచ్చాం. మాతోపాటు ఉమర్ ఖలీద్ కూడా ఉన్నారు. మేం టీ స్టాల్ వద్ద ఉన్న సమయంలో తెల్లచొక్కా ధరించిన వ్యక్తి మా వద్దకు వచ్చాడు. మమల్ని తోసేస్తూ ఖలీద్ లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ గందరగోళంలో అదుపుతప్పి కిందపడిపోయిన ఖలీద్.. బుల్లెట్ల నుంచి తప్పించుకున్నారు. మేం కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ అతడు గాలిలో కాల్పులు జరుపుతూ పారిపోయాడు. ఈ క్రమంలో అతని చేతిలోంచి పిస్టోల్ జారిపడిపోయింది. అతను పారిపోయాడు’ అని ఓ ప్రత్యక్ష సాక్షి ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు. Delhi: An unidentified man opened fire at JNU student Umar Khalid outside Constitution Club of India. He is unhurt. More details awaited. pic.twitter.com/ubNh4g4D80 — ANI (@ANI) 13 August 2018 -
సిగరెట్ కోసం తమ్ముడిని కడతేర్చాడు
న్యూఢిల్లీ : తన మంచి కోరిన తమ్ముడిని కడతేర్చాడు ఓ అన్న. అంతేకాకుండా దాన్ని సహజ మరణంగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నించాడు. కానీ చివరకు పోలీసులు విచారణలో నిజం ఒప్పుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ ఢిల్లీలో నివాసం ఉంటున్న శిశుపాల్ కుమార్‌కి విపరీతంగా సిగరెట్లు తాగే అలవాటు ఉంది. ఈ అలవాటు వల్ల అతనితో పాటు ఇంట్లో వాళ్లకు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీంతో అతని తమ్ముడు సత్యపాల్, ఆ అలవాటు మానుకోవాలంటూ శిశుపాల్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. అయిన శిశుపాల్ పట్టించుకోలేదు. గత కొన్ని నెలల నుంచి అన్నదమ్ముల మధ్య ఈ విషయంలో ఘర్షణ జరుగుతూనే ఉంది. కానీ బుధవారం వారిద్దరి మధ్య వాగ్యూద్ధం తార స్థాయికి చేరింది. సత్యపాల్ తన అన్న చేత ధూమపానాన్ని విరమింపచేయాలని భావించాడు. తన తమ్ముడు తరచు తనకు అలా చెప్పడం నచ్చని శిశుపాల్ అతనిపై దాడికి ప్రయత్నించాడు. తన షూ లేస్‌ని సత్యపాల్ మెడకి గట్టిగా బిగించడంతో అతడు ప్రాణాలు కొల్పోయాడు. అయితే శిశుపాల్ దీన్ని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. సత్యపాల్ని ఆస్పత్రికి తరలించాడు. తన తండ్రికి తమ్ముడు అపస్మారక స్థితిలో ఉన్నాడనే సమాచారం ఇచ్చాడు. కానీ ఆస్పత్రి సిబ్బంది మాత్రం సత్యపాల్ మరణాన్ని అనుమానస్పద మృతిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో అతను గొంతు నులిమి చంపబడ్డాడని తెలడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. శిశుపాల్పై అనుమానంతో గురువారం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చివరకు పోలీసుల విచారణలో శిశుపాల్ శనివారం తన నేరాన్ని అంగీకరించాడు. శిశుపాల్తోపాటు నలుగురు సోదరులు ఒకే ఇంట్లో ఉండేవాళ్లని అతని బార్య పోలీసులకు తెలిపారు. సత్యదేవ్‌కు మాత్రమే ఉద్యోగం లేదని.. అన్నదమ్ములు మధ్య చాలా రోజులుగా గొడవలు జరిగేవని.. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నారు. -
సెంట్రల్ ఢిల్లీలో నిలిచిపోయిన ట్రాఫిక్
బీజేపీ నిరసన ప్రదర్శనే కారణం సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య ఘటనకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీతో సెంట్రల్ ఢిల్లీలో గురువారం ఉదయం వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దాదాపు 150 మంది బీజేపీ కార్యకర్తలు ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన జరిపి, ఢిల్లీ సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. బిజీగా ఉండే ఐటీఓ ప్రాంతంలో ఈ నిరసన ప్రదర్శన కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాని ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా కనిపించింది. ఢిల్లీ గేట్, మండీ హౌజ్, మథురా రోడ్, తిలక్ మార్గ్, ఇండియా గేట్ తదిరత ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ఉండటం కోసం రోడ్లపై నిరసన ప్రదర్శన జరపరాదని బీజేపీ కార్యకర్తలను కోరినట్లు నగర పోలీసులు తెలిపారు. నిరసనకారులు, ప్రయాణికుల భద్రత కోసం పోలీసులు బారికేడ్లను అమర్చారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ట్రాఫిక్‌కు అడ్డంగా మారిన ఆందోళనకారులను చెదరగొట్టడం కోసం పోలీసులు వాటర్ కేన్లను ప్రయోగించారు. నిరసన ప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండడం కోసం పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. -
ఆహా అన్పించిన ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీవాసులు ఎంతటి చైతన్యవంతులో చెప్పేందుకు ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఆదివారం వెలువడిన తీర్పే నిదర్శనం. రాజధాని నగరమైన ఢిల్లీ మినీ భారత్‌ను తలపిస్తుంటుంది. కోటీశ్వరులతో పాటు, పొట్ట నింపుకోవడానికి కోటి కష్టాలు పడే పేదలున్న బస్తీలు కూడా ఇక్కడ అపారం. అన్నింటికి మించి భారత దేశంలోని వివిధ రాష్ట్రాల, ప్రాంతాలవారు ఇక్కడ స్థిరపడిన వారిలో ఉంటారు. ఇలా చూస్తే ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఆయా రాష్ట్రాల, ప్రాంతాల, కులాల సమీకరణాలు పని చేస్తుంటాయి. అయితే వీటన్నింటిని పక్కకు నెడుతూ ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు అన్ని వర్గాలూ బాసటగా నిలిచాయి. 28 స్థానాల్లో ఆప్ గెలవగా, పదిహేనేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కరిష్మా తోడై బీజేపీ 32 స్థానాలు సాధించడం తెలిసిందే. ఢిల్లీ ఓటరు తీర్పును ప్రాంతాలవారీగా ఢిల్లీని సెంట్రల్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, నార్త్‌వెస్ట్ ఢిల్లీ, నార్త్ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, సౌత్‌ఢిల్లీ, సౌత్‌వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీగా విభజించి పరిశీలించవచ్చు. సెంట్రల్ ఢిల్లీ: 4 సీట్లలో ఆప్‌కు 3 సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ ప్రాంతంలో బల్లిమరన్, కరోల్‌బాగ్, న్యూఢిల్లీ, జంగ్‌పురా... ఇలా 4 అసెంబ్లీ స్థానాలుంటాయి. వీటిలో ఎక్కువ మంది ఓటర్లు కేంద్ర ప్రభుత్వోద్యోగులు, మురికివాడల ప్రజలే. వీటిలో న్యూఢిల్లీ సహా మూడింటిని ఆప్ చేజిక్కించుకుంది. బల్లిమరన్ను మాత్రం కాంగ్రెస్ కనాకష్టంగా నిలబెట్టుకుంది. ఉద్యోగులతోపాటు పేదలు, దిగువ మధ్యతరగతి వారు తిరుగులేని మెజారిటీతో ఆప్‌కు పట్టం కట్టారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా ఉన్న ఇక్కడి జుగ్గీజోపిడీల ఓటర్లు సైతం కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్త్‌వెస్ట్, నార్త్ ఢిల్లీ...: 20 సీట్లలో ఆప్‌కు 7: ఈ ప్రాంతాల్లోని 20 స్థానాల్లో కొన్ని శివారు ప్రాంతాలు. వాటిలో చాలామంది ఓటర్లు కేజ్రీవాల్ స్వరాష్ట్రమైన హర్యానా వారే. దాంతో ఎక్కువ మంది ఆప్ వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానాల్లో ఈసారి బీజేపీ, ఆప్ చెరో 7 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ మూడింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెస్ట్ ఢిల్లీ, సౌత్‌వెస్ట్ ఢిల్లీ: 21 సీట్లలో ఆప్‌కు 9 21 స్థానాలున్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది! ఇక్కడ ఎక్కువగా పంజాబీలు, హర్యానాలతో పాటు దక్షిణాది ఓటర్లుంటారు. వీరంతా ఈసారి కాంగ్రెస్‌కు పూర్తి వ్యతిరేక ఫలితాలిచ్చారు. ఇక్కడ ఆప్ 9 స్థానాలు గెలిచింది. దళితులు,పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతాల ఓటర్లంతా ఆప్‌వైపు మళ్లడం గమనార్హం. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో సిక్కులంతా బీజేపీకే మద్దతిచ్చారు. బీజేపీకి 11, దాని మిత్రపక్షం అకాలీదళ్‌కు 1 వచ్చాయి. సౌత్ ఢిల్లీలో...: 10 సీట్లలో ఆప్‌కు 5 ఇక్కడి 10 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువగా తమిళ, మలయాళీ, తెలుగు తదితర దక్షిణాది ఓటర్లతో పాటు ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ. వీరిలో చాలామంది ఆప్కే ఓటేశారు. కాంగ్రెస్‌పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ ఆప్ పట్టు నిలుపుకుంది. మురికి వాడల్లోని లక్షలాది ఓట్లు గుండుగుత్తగా దాని ఖాతాలోకి వెళ్లాయి. ఆప్‌కు 5, మధ్యతరగతి ఓటర్లున్న ప్రాంతాల్లో బీజేపీకి 4 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ మాత్రం ముస్లిం ఓటర్లు కాస్త ఎక్కువగా ఉన్న ఆసిఫ్‌నగర్‌తో సరిపెట్టుకుంది. ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో...: 15 సీట్లలో ఆప్‌కు 4 ఈస్ట్ ఢిల్లీవాసుల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్‌తో పాటు పర్వత ప్రాంతీయులు. వీరిలో ఢిల్లీ ఓటర్లలో కీలకంగా భావించే పూర్వాంచలీయులు ఉండే ప్రాంతాలు కూడా ఎక్కువే. ఈ ప్రాంతంలో 15 స్థానాల్లో బీజేపీ ఎనిమిది కైవసం చేసుకుంది. అనధికారిక కాలనీలు, బెంగాలీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆప్ 4 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌గా భావించే అనధికారిక కాలనీల్లో, మురికి వాడల్లో ఆప్‌కు భారీ మద్దతు లభించడం విశేషం.