పింప్రి, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చరిత్ర సృష్టించబోతున్నామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అటవలే ధీమా వ్యక్తం చేశారు. పుణేలో ఆదివారం నిర్వహించిన సత్తా పరివర్తన్ (అధికారంలో మార్పు) మేళావాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని ఓడించిన విధంగానే త్వరలో అసెంబ్లీ ఎన్నికలల్లో కూడా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆర్పీఐకి 20 అసెంబ్లీ సీట్లను ఆగష్టు 15వ తేదీ లోపు కేటాయిచాలని, అదేవిధంగా ఏ ఏ అసెంబ్లీ సీట్లను కేటాయిస్తున్నారనే విషయాన్ని మహాకూటమి నేతలు ప్రకటించాలని ఆయన కోరారు. ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వాలకు 15 ఏళ్లుగా తాము మద్దతు ఇచ్చామని, ఇకపై వారిని ఓడించేందుకు మహాకూటమిలో చేరుతున్నామన్నారు. సునీల్ తట్కరేను రాష్ర్ట ఎన్సీపీ అధ్యక్షుడిగా చేసిన్నంత మాత్రాన గెలవలేరని, అతని సత్తా గత పార్లమెంట్ ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు.
మాలిన్ గ్రామ ప్రజల పునరావాసానికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తక్షణమే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి సహ్యాద్రి పర్వత ప్రాంతాల కింద ఉన్న ప్రమాదకర గ్రామాలను గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరారు. కర్నాటకలో సరిహద్దుల్లో జరుగుతున్న కన్నడ మరాఠీల వివాదాన్ని రాజ్యసభలో ప్రశ్నించనున్నట్లు తెలిపారు.
ఆర్పీఐ సీనియర్ నేత అవినాష్ మహాతేకర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో రాందాస్ ఆటవలేకు చోటు కల్పించాలని ప్రధాన మంత్రి మోడిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ కార్యకర్తల విన్నపం మేరకు పుణేలోని కంటోన్మెంట్, వడగావ్ శేరి, పింప్రి అసెంబ్లీ స్థానాలను ఆర్పీఐకే కేటాయించాలని కోరారు. వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
ఈ కార్యక్రమంలో సత్తా పరివర్తన్ పశ్చిమ మహారాష్ట్ర విభాగ రాష్ట్ర కార్యదర్శి అవినాష్, రాజాభావు సరవణే, రాష్ర్ట కోశాధికారి ఎం.డి.శేవలే, పార్టీ కార్పొరేషన్ నాయకుడు సిద్దార్థ్ ఘోండే, యూత్ అధ్యక్షులు పరుశురాం వడేకర్, నగర అధ్యక్షులు మహేంద్ర కాంబ్లే తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
Published Mon, Aug 4 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement