న్యూఢిల్లీ: పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కాంగ్రెస్ పార్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. గత విధానాలకు భిన్నంగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన విషయాలను గుర్తించేందుకు ఒక రీసెర్చ్ ఏజెన్సీని పార్టీ నియమించింది. మేనిఫెస్టోలో ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి, పథకాల అమలుకు సంబంధించిన గణాంకాలు, ఓటర్ల మనోభావాలు మొదలైన అంశాలపై ఆ ఏజెన్సీ నివేదిక సమర్పిస్తుంది. మేనిఫెస్టో కమిటీ సభ్యుడు, ఆర్థికమంత్రి చిదంబరం సూచనతో ఏజెన్సీ సహకారం తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. దాంతోపాటు కార్పొరేట్ రంగ అభిప్రాయాలను కనుక్కునేందుకు ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ నియమించింది. వారు కార్పొరేట్ దిగ్గజాలను, ఫిక్కీ, సీఐఐ లాంటి సంస్థలను సంప్రదించి కార్పొరేట్ రంగ ఆకాంక్షలను తెలుసుకుంటారు. అలాగే, పార్టీ రాష్ట్ర శాఖల నుంచి సలహాలు, సూచనలు తీసుకునే విధానాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు.