మానవత్వానికి మరో అవమానం
న్యూఢిల్లీ: ఓ స్వాతంత్ర్య దినోత్సవం.. ఓ మహాత్ముడి పండుగ.. ఇంకెవరో గొప్ప వాళ్ల జన్మదినోత్సవాలు. ఇలాంటి సందర్భాల్లో మాత్రం మేమంతా భారతీయ సోదరులం అని చెప్పుకుంటుంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మేమంతా సమానమే అని గొంతులు పిక్కటిల్లేలా అరుస్తూ ప్రతిజ్ఞలు చేస్తుంటారు. కానీ, వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు మాత్రం మాకు మేమే.. మేమింతే అనే చందాన వ్యవహరిస్తారు. ఢిల్లీలో ఓ రెస్టారెంటు వాళ్లు ఇలాగే చేశారు. శివ్ సాగర్ అనే రెస్టారెంటుకు వెళ్లిన వీధి బాలలను గెంటివేశారు. బట్టలు మురికిగా ఉన్నాయని చెప్పి వారిని లోపలికి రానివ్వకుండా తోసేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సోనాలి శెట్టి అనే సామాజిక కార్యకర్త కొంతమంది వీధి బాలలను తీసుకొని భోజనం పెట్టించేందుకు శివ్ సాగర్ అనే రెస్టారెంటుకు వెళ్లింది. అయితే, రెస్టారెంటు వాళ్లు ఆ పిల్లలు మురికిమురకిగా ఉన్నారని, డిగ్నిఫైడ్గా ఉండే హోటల్లో కూర్చొనివ్వడం సాధ్యం కాదని వారిని వెళ్లకొట్టారు. ఈ ఘటనపై ఓ చిన్నారి స్పందిస్తూ 'బామ్మ మాకు భోజనం పెట్టిస్తానని హోటల్కు తీసుకెళ్లింది. కానీ అక్కడ ఉన్న అంకుల్ బయటకు గెంటేశాడు. దీదీ డబ్బులు కూడా ఇస్తానంది. అయినా మాకు భోజనం పెట్టేందుకు, లోపలికి రానిచ్చేందుకు నిరాకరించారు. దాంతో మేం శరవణ భవన్ వద్ద భోజనం చేశాం' అని బాధపడుతూ చెప్పింది.
ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వేగంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి 24గంటల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. ఇలాంటి రోజుల్లో కూడా వివక్ష చూపడం దారుణం అన్నారు. కాగా, హోటల్ యాజమాన్యం మాత్రం పూర్తి భిన్నంగా స్పందించింది. ఆ వీధి బాలలు లోపలికి వచ్చి అల్లరిచిల్లరగా వ్యవహరించారని చెప్పారు. డిస్ట్రబ్ చేసేవారిని బయటకు పంపడం తమ హక్కు అని చెప్పారు. తామేం తప్పు చేసినట్లు భావించడం లేదని అన్నారు.