వాద్రాకు 44 కోట్ల అక్రమ ఆదాయం
చండీగఢ్: హర్యానాలోని గుర్గావ్‌లో ఒక భూలావాదేవీకి సంబంధించి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా రూ. 44 కోట్లను అక్రమంగా ఆర్జించారంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఇచ్చిన నివేదిక రాజకీయంగా దుమారం లేపుతోంది. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆదివారం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. భూపీందర్ సింగ్ హూడా నేతృత్వంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇతర భూ అక్రమాలపైనా అదే విధంగా స్పందించారు.
‘కాగ్’ ఏమంది?
హూడా హయాంలో గుర్గావ్‌లో ఒక వాణిజ్య కాలనీ నిర్మాణానికి వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు ప్రభుత్వం అనుమతించిందని, ఆ సమయంలో ఆ సంస్థ వద్ద కేవలం రూ. లక్ష పెట్టుబడే ఉందని, అనంతరం ఆ నిర్మాణ లెసైన్స్‌ను డీఎల్‌ఎఫ్ సంస్థకు వాద్రా సంస్థ రూ. 58 కోట్లకు అమ్ముకుందని కాగ్ తన నివేదికలో వివరించింది. ఇలా అత్యంత తక్కువ సమయంలో,పెట్టుబడి లేకుండా రూ. 43.66 కోట్లను ఆ సంస్థ ఆర్జించిందని పేర్కొంది. ప్రభుత్వానికి, స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు కుదిరిన ఒప్పందం ప్రకారం.. ప్రాజెక్టును డెవలప్ చేసినందుకు గానూ రూ. 2.15 కోట్లను మాత్రమే స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ లాభంగా స్వీకరించి, మిగతా రూ. 41.51 మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలి. కానీ ఆ విధంగా జరగలేదని కాగ్ ఆరోపించింది.
ఇంత రాద్ధాంతమా?
మరోవైపు, శనివారం కాగ్ నివేదికపై ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై వాద్రా ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. మైక్రోఫోన్‌ను పక్కకు నెట్టేసిన ఘటనపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. జర్నలిస్టులు సంయమనం పాటించాలని, అధికారిక పదవిలో లేని ఒక ప్రైవేటు వ్యక్తిని.. హైకోర్టు, సుప్రీంకోర్టుల వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు కొట్టేసిన అంశంపై పదేపదే ప్రశ్నిస్తూ.. విసిగించడం సరికాదని కాంగ్రెస్ సూచించింది. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ మతకల్లోలాల గురించి ప్రశ్నించినందుకు జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూ మధ్యలోంచి ప్రస్తుత ప్రధాని మోదీ ఆగ్రహంతో వెళ్లిపోయారని గుర్తు చేసింది. చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం సరికాదని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ అన్నారు. ‘రాజకీయ నేతలుగా మమ్మల్ని జర్నలిస్టులు లక్ష్యంగా చేసుకోవద్దు. వాద్రాను వదిలేయండి’ అని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. వాద్రా ప్రవర్తన ఆయన నిస్పృహను సూచిస్తోందని, దేశమిప్పుడు గాంధీ కుటుంబ పాలనలో లేదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలంది. వాద్రా క్షమాపణ చెప్పాలని బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ కోరింది.
కూతురు ఇంటికి వెళ్లిన సోనియా
సోనియాగాంధీ ఆదివారం కూతురు ప్రియాంక, అల్లుడు వాద్రాల ఇంటికి వెళ్లారు. కాగ్ నివేదిక, ఆ విషయాన్ని ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై వాద్రా ఆగ్రహం నేపథ్యంలో.. వాద్రా ఇంటికి సోనియా వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ అరగంట పాటు సోనియా ఉన్నారని, ఆ సమయంలో వాద్రా కూడా ఇంట్లోనే ఉన్నారని సమాచారం.