
తెలంగాణకు రూ.1,673 కోట్లు
అటల్ మిషన్ పథకంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.1,673 కోట్లు కేటాయించింది.
అటల్ మిషన్ కింద కేటాయించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: అటల్ మిషన్ పథకంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.1,673 కోట్లు కేటాయించింది. 2015–17 మధ్యకాలానికి రూ.970 కోట్లు, వచ్చే మూడేళ్లలో రూ.703 కోట్ల మేర నిధుల వ్యయానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1,673 కోట్ల నిధుల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తన వాటాగా రూ.832 కోట్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు నిధుల కేటాయింపునకు కేంద్ర మంత్రి వెంకయ్య ఆమోదం తెలిపారు. తెలంగాణలో అమృత్ పథకం కింద ఎంపికైన 12 పట్టణాలకు నిధుల విడుదలపై శుక్రవారం ఢిల్లీలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ 12 పట్టణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రణాళికలను సమీక్షించిన కేంద్రం.. 2015–16కు రూ.415 కోట్లు, 2016–17కు రూ.555 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది.
అలాగే 2017–20 మధ్యకాలానికి రూ.703 కోట్లు కేటాయించడానికి అంగీకరించింది. రానున్న మూడేళ్లకు ఆమోదించిన నిధుల్లో నీటి సరఫరా కోసం రూ. 559 కోట్లు, మురుగునీటి వ్యవస్థ నిర్మాణానికి రూ.126 కోట్లు.. పార్కులు, పచ్చదనం పెంపునకు రూ.17 కోట్లను కేటాయించనున్నారు. తాగునీటి సరఫరాకు కేటాయించిన రూ.559 కోట్ల నిధుల్లో వరంగల్‌కు మాత్రమే రూ.424 కోట్లు కేటాయించనున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకుగాను ఖమ్మంకు రూ.47 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.41 కోట్లు, కరీంనగర్‌కు రూ.24 కోట్లు, నల్లగొండకు రూ.11 కోట్లు, మిర్యాలగూడకు రూ.4 కోట్లు, సూర్యాపేటకు రూ.1.45 కోట్లు కేటాయించనున్నారు. అమృత్ మిషన్‌లో భాగంగా పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు అందివ్వాలని, ఒక్కో మనిషికి రోజుకు రూ. 135 లీటర్ల నీరివ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.